
పుస్తకాల కోసం లైబ్రరీకి వెళ్లిన విద్యార్థులకు అక్కడ ఊహించని అనుభవం ఎదురైంది. వరుసగా పేర్చి ఉన్న పుస్తకాల మధ్య ఒక భయంకరమైన జీవి నక్కి ఉండటం చూసి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కేరళలోని పాలక్కాడ్‌లో గల ప్రసిద్ధ విక్టోరియా కాలేజీలో జూన్ 4న జరిగిన ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విక్టోరియా కాలేజీలోని సంస్కృత విభాగానికి చెందిన లైబ్రరీలో విద్యార్థులు ఎప్పటిలాగే తమకు కావలసిన పుస్తకాల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఒక బుక్ షెల్ఫ్‌లోని పుస్తకాల మధ్య ఏదో కదలిక కనిపించింది. ఇంకాస్త నిశితంగా పరిశీలించిన విద్యార్థులు.. పుస్తకాల సందులో నక్కి ఉన్న పామును చూసి భయంతో అరుపులు లంఘించుకున్నారు. వెంటనే విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన కాలేజీ అధికారులు ఆలస్యం చేయకుండా అటవీ శాఖకు సమాచారం అందించారు. దాంతో అటవీ శాఖకు చెందిన గుర్తింపు పొందిన స్నేక్ క్యాచర్ అనూప్ హుటాహుటిన కాలేజీ లైబ్రరీకి చేరుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. స్నేక్ క్యాచర్ అనూప్ ఎంతో శాంతంగా, చాకచక్యంగా బుక్ షెల్ఫ్‌లను పరిశీలిస్తూ, పుస్తకాల మధ్య దాక్కున్న పామును సురక్షితంగా బయటకు తీయడం కనిపిస్తుంది. పామును విజయవంతంగా బంధించడంతో విద్యార్థులు, కాలేజీ సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సాధారణంగా కేరళలో పాములు కనిపించడం పెద్ద వింతేమీ కాదు, కానీ ఇలా కాలేజీ లైబ్రరీలో.. అదీ సంస్కృత పుస్తకాల మధ్య పాము చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పాముకు సాహిత్యంపై ప్రేమ ఎక్కువైపోయినట్టుంది.. అందుకే సంస్కృతం చదవడానికి లైబ్రరీకి వచ్చింది’’ అంటూ కొందరు జోకులు పేలుస్తుంటే.. మరికొందరు స్నేక్ క్యాచర్ ఎంత కూల్‌గా ఆపరేషన్ పూర్తి చేశాడోనని ప్రశంసిస్తున్నారు.
A moment of concern unfolded at #VictoriaCollege in #Kerala‘s #Palakkad district after a #cobra was spotted inside the campus library. The #snake was noticed by #students who had entered the library to borrow books, prompting them to immediately alert college authorities. pic.twitter.com/neP52BdNGz
— News9 (@News9Tweets) June 5, 2026