ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు.. అంతలో..

ఎలుగుబంటి దాడి చేస్తే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. కానీ రష్యాలో ఓ 15 ఏళ్ల బాలుడి విషయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి నుంచి తప్పించుకునే క్రమంలో బాలుడి జేబులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ పేలింది. పేలుడు శబ్దానికి భయపడిన ఎలుగుబంటి బాలుడిని వదిలేసి అడవిలోకి పారిపోయింది. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన బాలుడికి ప్యాంట్ జేబులో ఫోన్‌ పేలడంతో కాలిన గాయాలూ అయ్యాయి.

ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు.. అంతలో..
Smartphone Explosion Saves Teen From Brutal Bear Attack In Russia

Updated on: Oct 13, 2026 | 8:54 PM

రష్యాలోని అల్తాయ్‌ ప్రాంతంలో 15 ఏళ్ల బాలుడు తన స్నేహితుడితో కలిసి మారుమూల ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి ఓ ఎలుగుబంటి వేగంగా రావడం గమనించిన బాలుడు.. దాన్నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని చెట్టు పైకి ఎక్కాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఎలుగుబంటి అతడిని చెట్టు నుంచి కిందకు లాగి, దాడి చేయడం ప్రారంభించింది. పంజాతో కొట్టడంతో పాటు చేతి గోళ్లతో తీవ్రంగా రక్కింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి బాలుడు అరుస్తున్న శబ్దం విని వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే ఎలుగుబంటి అతడిని చెట్టు నుంచి కిందకు లాగుతోంది. వెంటనే తన కుక్కలను దానిపైకి వదిలాడు.

ఎలుగుబంటి నోట్లో ఫోన్‌.. ఒక్కసారిగా పేలుడు!

ఎలుగుబంటి దాడి చేస్తున్న సమయంలో బాలుడి జేబులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ కీలకంగా మారింది. ఎలుగుబంటి బాలుడి జేబులోని ఫోన్‌ ను ఒక్కసారి కొరకడంతో ఫోన్‌లోని లిథియం అయాన్‌ బ్యాటరీ దెబ్బతిని మంటలు చెలరేగాయి ఆ వెంటనే పేలుడు సంభవించింది. సడెన్‌ గా జరిగిన పేలుడుతో ఎలుగుబంటి తీవ్రంగా భయపడి బాలుడిని వదిలేసి అడవిలోకి పారిపోయింది. దీంతో బాలుడికి ప్రాణాలతో బయటపడే అవకాశం లభించింది. అయితే అప్పటికే ఎలుగుబంటి దాడిలో తీవ్ర గాయాలకు తోడు ఫోన్‌ పేలుడు కారణంగా కాలిన గాయాలు కూడా అయ్యాయి.

తల, ముఖం, మెడకు తీవ్ర గాయాలు

బాలుడితో ఉన్న స్నేహితుడు సహాయం కోసం పరుగెత్తడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో బాలుడు ఆస్పత్రికి చేరుకున్నాడు. బాలుడి తల, ముఖం, మెడకు తీవ్ర గాయాలయ్యాయి.  చికిత్స అందించడం వైద్యులకు సవాలుగా మారింది.  మెరుగైన చికిత్స, ప్రత్యేక శస్త్రచికిత్సల కోసం బాలుడిని మాస్కోకు తరలించారు. ఛాతీతో పాటు శరీరంలోని దిగువ భాగంలో కూడా తీవ్ర గాయాలయ్యాయి.

ఎలుగుబంటి కోసం అధికారుల గాలింపు

ఈ దాడి సోల్టన్‌ అనే మారుమూల గ్రామానికి సుమారు 12 మైళ్ల దూరంలో జరిగింది. ఘటన తర్వాత సంబంధిత అధికారులు, వన్యప్రాణి సిబ్బంది ఎలుగుబంటి కోసం గాలింపు చేపట్టారు. ఎలుగుబంటిని బంధించే వరకు తమ వేట కొనసాగిస్తామని తెలిపారు. అయితే అటవీ ప్రాంతంలో వ్యాపించిన మంటల కారణంగా వన్యప్రాణులు జనావాసాల వైపుకి వస్తున్నట్లు గుర్తించిన అధికారులు సమీప  గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసారు.

Loading...
Unable to load recommendations.
Follow Us