
ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ పిల్లిని శాస్త్రవేత్తలు ఎక్కడో అడవిలో వెతికి పట్టుకోలేదు. బొలీవియాలోని ఓ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఇది ఏళ్లుగా జీవిస్తోంది. ఒక స్థానిక కుటుంబానికి అడవిలో ఈ పిల్లి కనిపించింది. దాన్ని ఇంట్లో పెంచుకోవాలని ప్రయత్నించారు. కానీ అడవి జంతువు కావడంతో ఎక్కువ కాలం పెంచలేక చివరకు దాన్ని సంరక్షణ కేంద్రంలో వదిలేశారు. అక్కడే ఓ వ్యక్తి ఆ పిల్లిని చూసి.. “ఇది మిగతా పిల్లుల్లా లేదు” అని అనుమానించాడు. ఆ మాటే కొత్త జాతి ఆవిష్కరణకు దారితీసింది.
బొలీవియా దేశానికి చెందిన బయాలజిస్ట్ పావోలా నోగాలెస్ ఈ పిల్లిని పరిశీలించారు. ఆమెను మొదట ఆకర్షించింది దాని సైజు. 10 ఏళ్ల వయసున్న మగ పిల్లి తల నుంచి తోక భాగం కేవలం 46 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. బరువు కూడా కేవలం 1.4 కిలోలు. అంటే.. సాధారణ ఇంటి పిల్లి కంటే కూడా చిన్నది! లేత గోధుమ రంగులో ఉండే దాని శరీరంపై చిరుతను పోలిన నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఈ పిల్లి దక్షిణ అమెరికా అడవి పిల్లుల కుటుంబంలో ఏ జాతికి చెందిందో తెలుసుకోవడానికి పరిశోధకులు జన్యు విశ్లేషణ చేపట్టారు. కొలంబియా, పెరూ, బ్రెజిల్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన 30కి పైగా పిల్లుల జన్యు నమూనాలను పరిశీలించారు. కొత్త నమూనాలు అందుబాటులో లేని చోట అమెరికా, యూరప్‌లోని మ్యూజియంలో భద్రపరిచిన ఎముకలు, చర్మాల నుంచి కూడా DNA సేకరించారు. అప్పుడు బయటపడిన విషయం శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచింది.
జన్యు పరిశోధనలో ఈ పిల్లి.. ఇతర దగ్గరి జాతుల నుంచి సుమారు 14 లక్షల ఏళ్ల క్రితమే ప్రత్యేకంగా విడిపోయిన వంశానికి చెందినదని తేలింది. అంటే ఇది సాధారణంగా కనిపించే మరో అడవి పిల్లి కాదు. ఇది ప్రత్యేకమైన కొత్త జాతి! ఈ పరిశోధనను Current Biology జర్నల్‌లో ప్రచురించారు.
New cat alert! A call from a wildlife sanctuary about a “weird cat” has led to the first new cat species discovered in over 100 years in Bolivia’s Yungas forest ecoregion. Learn more about this feline surprise: https://t.co/crffXvPqH4 https://t.co/USo7rI3Y5q
— National Geographic (@NatGeo) September 17, 2026
అడవి పిల్లుల ప్రపంచంలో ఇలాంటి గుర్తింపు చాలా అరుదు. చివరిసారిగా జీవించి ఉన్న కొత్త పిల్లి జాతిగా Uruguayan pampas catను 1923లో శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ జంతువు శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియనిది కాదు. స్థానిక ప్రజలకు ఈ పిల్లి గురించి ఎప్పటినుంచో తెలుసు.
కానీ శాస్త్రీయంగా ఇది ప్రత్యేకమైన జాతి అని ఇప్పటివరకు గుర్తించలేదు. దక్షిణ అమెరికాలో కనిపించే టైగర్ క్యాట్స్ ఒకదానికొకటి చాలా పోలి ఉంటాయి. అందుకే గతంలో వాటిని ఒకే జాతిగా పరిగణించేవారు. కానీ DNA విశ్లేషణతో అసలు విషయం బయటపడింది. ఈ సమూహంలో కనీసం ఐదు ప్రత్యేక జాతులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాటిలో నాలుగు ఇప్పటికే శాస్త్రీయంగా గుర్తించబడినవి కాగా.. ఇప్పుడు Leopardus tilcayo ఐదో జాతిగా చేరింది.
అయితే ఈ కొత్త పిల్లి గురించి శాస్త్రవేత్తలకు ఇంకా పూర్తిగా తెలియదు. అడవిలో వీటి సంఖ్య ఎంత? ఏం తింటాయి? ఎలా జీవిస్తాయి? ఎంత విస్తీర్ణంలో సంచరిస్తాయి? వీటికి ఎలాంటి ప్రత్యేక ప్రవర్తన ఉంటుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు. ఇప్పుడు శాస్త్రవేత్తల ముందు మరో పెద్ద సవాలు ఉంది. ఈ చిన్న పిల్లి జీవించే అడవులు వేగంగా మారుతున్నాయి. అడవుల నరికివేత, బంగారం కోసం తవ్వకాలు యుంగాస్ ప్రాంతంలోని జీవ వైవిధ్యంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ పిల్లి జాతి గురించి పూర్తిగా తెలుసుకునే లోపే దాని అడవి ప్రాంతం కనుమరుగైతే మాత్రం.. ఈ అరుదైన జీవిని రక్షించడం కష్టమవుతుంది. అయితే ప్రపంచంలోని అడవులను ఎంతగా అధ్యయనం చేసినా.. ప్రకృతి తనలో రహస్యాలను ఇంకా దాచుకునే ఉందని ఈ చిన్న పిల్లి మరోసారి గుర్తు చేసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి