హార్వర్డ్‌లో చదవాలన్నది ఆమె కల.. పాక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ లైబా మృతి!

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదివి శాస్త్రవేత్తగా ఎదగాలన్నది ఆమె కల. ఇందుకోసం కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. తండ్రి ఇంటి స్థలం అమ్మగా తల్లి నగలు తాకట్టు పెట్టింది. అయితే రూ. 93 లక్షల పాకిస్థానీ రూపాయలు తీసుకున్న కన్సల్టెంట్‌ హ్యాండిచ్చాడు. తట్టుకోలేకపోయిన 20 ఏళ్ల ఫిజిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ లైబా ఇజాజ్‌ ఆత్మహత్యకు పాల్పడింది. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆదేశాలతో నిందితుడిని అరెస్ట్ చేసారు.

హార్వర్డ్‌లో చదవాలన్నది ఆమె కల.. పాక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ లైబా మృతి!
Scammed Pak Gold Medallist Girl Kills Herself Milkman Dad Saved Lakhs For Harvard Dreams

Updated on: Oct 14, 2026 | 12:13 PM

అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదవాలన్నది లైబా చిరకాల స్వప్నం. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు సౌదీ అరేబియాలో చదివే అవకాశం, స్కాలర్‌షిప్‌ను ఆమె తిరస్కరించింది. లైబా ఇజాజ్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని సర్గోధాకు చెందిన యువతి. ఇస్లామిక్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. అయితే, ఆమె కలను తన స్వార్థానికి వాడుకున్న కన్సల్టెంట్‌ అమెరికాలో అడ్మిషన్‌, స్కాలర్‌షిప్‌, వీసా ఇప్పిస్తానని నమ్మించి, రూ. 93 లక్షల పాకిస్థానీ రూపాయలు తీసుకుని తప్పుడు పత్రాలు ఆమె చేతిలో పెట్టాడు.

కూతురి చదువు కోసం ఆస్తి అమ్మిన తండ్రి

లైబా కుటుంబం ఆర్థికంగా స్తోమత ఉన్న కుటుంబం కాదు. ఆమె తండ్రి 1994 నుంచి ఇస్లామాబాద్‌ వీధుల్లో పాలు, పెరుగు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్దగా చదువుకోకపోయినా, తన పిల్లలకు మంచి విద్య అందించాలనే లక్ష్యంతో కష్టపడ్డారు. కూతురి అమెరికా చదువుల కోసం ఇంటి స్థలాన్ని విక్రయించారు. మరోవైపు, లైబా తల్లి కూడా కూతురి భవిష్యత్తు కోసం తన నగలను తాకట్టు పెట్టారు.  తమ పొదుపు మొత్తాన్ని, విలువైన వస్తువులను సమకూర్చి కన్సల్టెంట్‌గా చెప్పుకునే వ్యక్తికి డబ్బులు చెల్లించారు.

తండ్రికి చెప్పవద్దని మేనమామను వేడుకున్న లైబా ..

విషయం తెలిసి లైబా తీవ్ర మనస్తాపానికి గురైంది.  జరిగిన మోసం గురించి తండ్రికి చెప్పవద్దని మేనమామను వేడుకున్నట్లు ది మీడియా లైన్ కథనంలో పేర్కొంది.  తండ్రి బాధపడతారని ఆమె తీవ్ర ఆందోళన చెందినట్లు సదరు బంధువు  మీడియాకు చెప్పారు. అక్టోబర్‌ 9న ఇస్లామాబాద్‌లోని  ఓ మార్కెట్‌ వద్ద చెట్టుకు వేలాడుతున్న స్థితిలో లైబా ఇజాజ్‌ మృతదేహాన్ని గుర్తించారు. లైబా మృతి అత్యంత విషాదకరమని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు.  ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయాలని ఇస్లామాబాద్‌ పోలీస్‌ చీఫ్‌ను ఆదేశించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు  ప్రధాన నిందితుడు మహమ్మద్ నోమన్‌ను అరెస్టు చేశారు. ఐదు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ ఇస్లామాబాద్ కోర్టు  ఆదేశాలు జారీ చేసింది.

ఏడుగురి సంతానంలో చిన్నది లైబా

లైబా ఏడుగురు సంతానంలో చిన్నది.  లైబా పెద్దక్క స్కాలర్‌షిప్‌తో చైనాలో చదువుకుంది. ప్రస్తుతం లాహోర్‌లోని ఓ చైనా కంపెనీలో అనువాదకురాలిగా పనిచేస్తుంది. అక్క విజయాలు, కుటుంబ త్యాగాలు లైబా ఆకాంక్షలకు ప్రేరణగా నిలిచాయి. అయితే, విదేశాల్లో చదువుకోవాలనే ఆమె కల నెరవేరకుండానే విషాదం చోటుచేసుకుంది. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, వీసాలు ఇప్పిస్తామని చెప్పే కన్సల్టెంట్లను నమ్మే ముందు వారి అధికారిక గుర్తింపు, సంబంధిత సంస్థ వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేయాల్సిన అవసరం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us