Video: వార్నీ.. మన దేశంలోని ఈ సిటీలో బతకడానికి 50లక్షల జీతం సరిపోదా..? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే..

ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే.. అందులో ఎంత మిగులుతోందనేదే అసలైన ఆర్థిక సూత్రం. బెంగళూరులో లక్షల ప్యాకేజీలు తీసుకుంటున్న ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ఏటా రూ.50 లక్షలు సంపాదిస్తున్నా బెంగళూరు లైఫ్‌స్టైల్ మిమ్మల్ని ధనవంతులుగా మారకుండా ఎలా అడ్డుకుంటుందో ఓ టెక్కీ వివరాలతో బయటపెట్టిన వీడియో వైరల్‌గా మారింది.

Video: వార్నీ.. మన దేశంలోని ఈ సిటీలో బతకడానికి 50లక్షల జీతం సరిపోదా..? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే..
Rs 50 Lpa Salary Is Not Enough In Bangalore

Updated on: Aug 13, 2026 | 7:10 PM

దేశ ఐటీ రాజధానిగా, స్టార్టప్‌ల కేరాఫ్‌ అడ్రస్‌గా పేరొందిన బెంగళూరులో భారీ జీతాలు సంపాదించడం సులువే కావచ్చు.. కానీ ధనవంతులు కావడం మాత్రం అంత సులువు కాదనిపిస్తుంది. ప్రతి ఏటా రూ.50 లక్షలు ప్యాకేజీ తీసుకుంటున్నా, బెంగళూరులోని ఖరీదైన జీవనశైలి, విపరీతంగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా పెద్ద మొత్తంలో సంపదను కూడబెట్టడం సాధ్యం కావడం లేదంటూ ఒక ఐటీ ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. అన్మోల్ అగర్వాల్ అనే ఐటీ ఉద్యోగి పోస్ట్ చేసిన ఈ లెక్కలు చూసి నెటిజన్లు, ఇతర టెక్కీలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

రూ.50 లక్షల జీతం.. చేతికి వచ్చేది ఎంత?

రూ.50 లక్షలను పూర్తి బేసిక్ సాలరీ పరిగణనలోకి తీసుకుంటే.. ఆదాయపు పన్ను, ఈపీఎఫ్ మినహాయింపుల తర్వాత చేతికి సుమారు రూ.35 లక్షలు మాత్రమే వస్తాయని అన్మోల్ వివరించారు. అంటే నెలకు సగటున చేతికి వచ్చేది దాదాపు రూ.3 లక్షలు. ఒక్క నెలకు రూ.3 లక్షల ఆదాయం అనేది చాలా పెద్ద మొత్తమే అయినప్పటికీ, బెంగళూరు నగర జీవన వ్యయం ఆ డబ్బును నీళ్లలా ఎలా కరిగించేస్తుందో ఆయన పూసగుచ్చినట్లు వివరించారు.

నెలవారీ ఖర్చుల చిట్టా.

  • ఇంటి అద్దె (2BHK): రూ. 60,000 నుండి రూ. 70,000
  • ఇంటి పని, వంట మనుషులు: రూ.10,000 చొప్పున అదనంగా..
  • రోజువారీ ఖర్చులు, జిమ్, షాపింగ్, ప్రయాణం: నెలకు రూ. 1.2 లక్షల నుండి రూ. 1.3 లక్షలు
  • కారు ఈఎంఐ – నిర్వహణ: ఒకవేళ సొంత కారు ఉంటే నెలకు మరో రూ. 50,000 ఖర్చు
  • పిల్లల చదువులు: ఒకవేళ పిల్లలు ఉంటే పాఠశాల ఫీజులు, ఇతర ఖర్చులు ఈ లెక్కకు అదనం.

ఈ లెక్కన నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్న ఒక టెకీ, అన్ని ఖర్చులు పోనూ పెట్టుబడుల కోసం నెలకు కేవలం రూ. 1 లక్ష మాత్రమే పొదుపు చేయగలరని ఆయన స్పష్టం చేశారు.

బెంగళూరులో సొంత ఇల్లు ఒక కలగానే మిగిలిపోతుందా?

నగరంలో రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలనంటుతున్న విషయాన్ని కూడా అన్మోల్ తన వీడియోలో ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతం బెంగళూరులో మంచి ప్రాంతంలో ఒక ఇంటి ధర సగటున రూ.3 కోట్లు ఉంది. రాబోయే ఐదారు ఏళ్లలో ఇది రూ.6 నుండి 7 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ప్రతి నెలా మిగిలే రూ.1 లక్ష పెట్టుబడితో అంతటి భారీ మొత్తంలో ఆస్తిని సమకూర్చుకోవడం లేదా ఆర్థికంగా స్థిరపడటం దాదాపు అసాధ్యం’’ అని ఆయన విశ్లేషించారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి?

ఖరీదైన మెట్రో నగరాల్లో ఉంటూ జీవితాంతం సంపాదనంతా ఖర్చులకే తగలేసే కంటే కొన్ని ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చని ఆయన సూచించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్: తక్కువ జీవన వ్యయం ఉండే టైర్-3 నగరాల్లో నివసిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం.

స్వంత వ్యాపారం: ఐటీ ఉద్యోగానికి మాత్రమే పరిమితం కాకుండా స్వంతంగా బిజినెస్ ప్రారంభించడం ద్వారా సంపదను సృష్టించడం.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన

ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు టెక్కీలు ఆయన చెప్పిన లెక్కలు నూరు శాతం వాస్తవమని, బెంగళూరు లైఫ్‌స్టైల్ ఖర్చులు నిజంగానే జీతాన్ని హరించేస్తున్నాయని మద్దతు తెలిపారు. మరికొందరు మాత్రం.. ‘‘నెలకు రూ. 1.3 లక్షలు కేవలం ప్రయాణాలు, షాపింగ్‌కే ఖర్చు చేయడం హంగులకు పోవడమే అవుతుంది. సరిగ్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే రూ.50 లక్షల జీతంతో హ్యాపీగా కోటీశ్వరులు కావచ్చు’’ అని కామెంట్లు చేస్తున్నారు.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us