
ఎలాంటి ఆడంబరాలు లేవు.. భారీ పెట్టుబడులు, ఖరీదైన ఇంటీరియర్ అంతకంటే లేవు. హైవే పక్కన ఉన్న ఓ చిన్న దాబా లాంటి ఫుడ్ స్టాల్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. గ్రామీణ ప్రాంతానికి సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఈ చిన్న దుకాణం రోజుకు సుమారు 65 మందికి రూ.100కే మంచి భోజనం అందిస్తూ, నెలకు దాదాపు రూ. 1.95 లక్షల మేర టర్నోవర్ సాధిస్తుంది. నళిని ఉనగర్ అనే నెటిజన్ ఎక్స్ వేదికగా పంచుకున్న ఈ విజయగాథ తక్కువ ఖర్చుతో స్థానికంగా నడిచే వ్యాపారాల సంపాదన సామర్థ్యంపై పెద్ద చర్చే లేవనెత్తింది.
ఈ చిన్న దుకాణంలో రూ.100కే రెండు రకాల కూరలు, రోటీ, పప్పు, అన్నం, పాపడ్, సలాడ్‌తో కూడిన సంపూర్ణ థాలీ లభిస్తుంది. ప్రధాన రహదారిపై ఉండటం వల్ల రోజూ దాదాపు 25 మందికి పైగా దుకాణంలోనే భోజనం చేస్తుండగా, పరిసర గ్రామాల నుంచి మరో 40 మందికి పైగా నిత్యం టిఫిన్ బాక్సులు ఆర్డర్ చేస్తున్నారు. గ్రామాల్లో ఒంటరిగా నివసించే వృద్ధులు, వ్యవసాయ పనులకు వచ్చే కూలీలు వీరి ప్రధాన కస్టమర్లుగా ఉన్నారు. రోజుకు 65 థాలీల చొప్పున లెక్కిస్తే రోజువారీ ఆదాయం రూ. 6,500 కాగా, నెలకు రూ.1.95 లక్షలు, ఏడాదికి ఏకంగా రూ. 23.4 లక్షల వ్యాపారం జరుగుతోంది.
ఈ వ్యాపారంలో యజమాని, అతని భార్యే స్వయంగా వంట చేయడం వల్ల అదనపు సిబ్బంది ఖర్చులు లేవు. అంతేకాకుండా యజమానికి చెందిన వ్యవసాయ భూమిలో పండే కూరగాయలనే వంటకు వినియోగిస్తుండటంతో ముడిసరుకు వ్యయం గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఈ వ్యాపారంలో కనీసం 60 శాతం మార్జిన్‌తో నెలకు రూ.1 లక్షకు పైగా నికర లాభం వస్తుందని పోస్ట్‌లో తెలిపారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆదాయం స్పష్టంగా ఉన్నప్పటికీ, 60 శాతం లాభం అనేది కేవలం స్థూల అంచనా మాత్రమేనని కొందరు వ్యాఖ్యానించారు. గ్యాస్ సిలిండర్, విద్యుత్, ప్యాకేజింగ్, రవాణా, ఆహార వృథా, యజమానుల సొంత శ్రమ విలువను లెక్కలోకి తీసుకుంటే అసలైన నికర లాభం ఎంతనేది స్పష్టమవుతుందని కామెంట్లు చేశారు. మరికొందరు ఈ మోడల్‌ను సమర్థించారు. వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా.. తక్కువ నిర్వహణ ఖర్చులు, స్థానిక డిమాండ్, నాణ్యమైన ఆహారంతో నిలకడగా నడపడం ద్వారా చిన్న వ్యాపారాలు అద్భుతమైన సంపాదన సాధించగలవని విశ్లేషించారు. నేటి రోజుల్లో రూ.100కే కడుపునిండా స్వచ్ఛమైన భోజనం దొరకడం గొప్ప విషయమని, ఆహార వ్యాపారంలో నాణ్యత, పరిశుభ్రత పాటిస్తే ఇలాంటి వ్యాపారాలు దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగుతాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Never underestimate a small shop.
I visited a small food shop on a main road near a village and talked to the owner.
They sell a full thali for ₹100:
– 2 sabjis, roti, dal, rice, papad and saladI asked: How many people come daily?
Owner:
– 25+ people eat here daily because… pic.twitter.com/ZBaSzwYTrh— Nalini Unagar (@NalinisKitchen) August 14, 2026