
భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారినప్పటి నుంచి ఇరు దేశాల సాంస్కృతిక సంబంధాలపైనా ప్రభావం పడింది. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత పరిస్థితులు మారాయి. ఈ దాడితో పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్‌పై భారత్‌లో ఆంక్షలు విధించాలనే డిమాండ్లు పెరిగాయి. 2025 మే 8న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్‌ను నిలిపివేయాలని ఓటీటీ వేదికలకు సూచనలు జారీ చేసింది.
తాజాగా రెండు వేర్వేరు ఘటనలు ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ (Jo Bachay Hain Sang Samait Lo) అనే పాకిస్థానీ వెబ్ సిరీస్ ప్రమోషన్లు ఒక వైపు, ఢిల్లీలో ‘దర్-ఎ-నిజాత్’ (Dar-e-Nijaat) అనే పాకిస్థానీ టీవీ సీరియల్ ప్రత్యేక ప్రదర్శన వివాదానికి కారణమయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్ తన తొలి పాకిస్థానీ ఒరిజినల్ సిరీస్‌గా ప్రచారం చేస్తున్న ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ (Jo Bachay Hain Sang Samait Lo) డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, అహద్ రజా మీర్, హానియా అమీర్, సనమ్ సయీద్ నటిస్తున్నారు. వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రచార పోస్టర్లు బయటకు రావడంతో భారత్‌లో విమర్శలు మొదలయ్యాయి. భారత్ లో ఈ సిరీస్ విడుదల కాకుండా అడ్డుకోవాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. 2025 మే 8న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ పాకిస్థాన్ కంటెంట్‌ను భారతీయ ఓటీటీ వేదికల్లోప్రసారం చేయకూడదని డిమాండ్ చేసింది.
ఈ వెబ్ సిరీస్‌పై వ్యతిరేకతకు మరో కారణం కూడా ఉంది. ఇందులో నటిస్తున్న ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ఈ ఇద్దరు నటులు గతంలో స్పందించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫవాద్ ఖాన్ భారత సైనిక చర్యలను ‘సిగ్గుచేటు’గా అభివర్ణించగా మహిరా ఖాన్ వాటిని ‘పిరికిపందల దాడి’గా పేర్కొన్నారు. దీంతో అలాంటి వ్యాఖ్యలు చేసిన నటులు నటించిన సిరీస్‌ను భారతీయ ప్రేక్షకులు ఎందుకు చూడాలంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. భారతీయుల ఆదరణతో పాకిస్థాన్ వినోద పరిశ్రమకు ఆదాయం సమకూరకూడదని వాదిస్తున్నారు.
ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.’వారి కంటెంట్‌పై ఎలాంటి ద్వేషం లేదు. కానీ దాని వెనకున్న ఆర్థిక అంశాన్ని కూడా చూడాలి. భారతీయ ప్రేక్షకుల ఆదరణ ద్వారా పాకిస్థాన్ వినోద పరిశ్రమ లాభపడేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదు’ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
ఇక రెండో వివాదం దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ARY Digital రూపొందించిన ‘దర్-ఎ-నిజాత్’ (Dar-e-Nijaat) టీవీ సీరియల్‌ను ఢిల్లీలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్ కోసం టికెట్లు విక్రయించగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరైనట్లు సమాచారం. పాకిస్థానీ కంటెంట్‌పై నిషేధం ఉండాలనే డిమాండ్లు వినిపిస్తుంటే ఢిల్లీలో పాకిస్థానీ సీరియల్‌కు టికెట్లు పెట్టి ప్రదర్శన ఎలా నిర్వహించారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఓటీటీ వేదికలు కొన్ని దేశాల్లో కంటెంట్‌ను నిలిపివేసినా ఇంటర్నెట్‌లో జియో-రిస్ట్రిక్షన్లను దాటుకుని వాటిని చూసే అవకాశం ఉందని కొందరు గుర్తుచేస్తున్నారు. అందువల్ల ఇలాంటి నిషేధాలు ఎంతవరకు సమర్థంగా అమలవుతాయనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.