నాగుపాము కంటే డేంజర్.. నిద్రలోనే ప్రాణాలు తీసే ఈ పాము గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..

సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన పాము అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది కోబ్రా.. కానీ భారతదేశంలో నాగుపాము కంటే వంద రెట్లు డేంజర్ అయిన, నిశబ్దంగా ప్రాణాలు తీసే ఒక సైలెంట్ కిల్లర్ పాము ఉందన్న విషయం మీకు తెలుసా? ఇది కరిస్తే కనీసం నొప్పికూడా తెలియదు, తెల్లవారేసరికి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

నాగుపాము కంటే డేంజర్.. నిద్రలోనే ప్రాణాలు తీసే ఈ పాము గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..
Why Common Krait Is Called The Silent Killer

Updated on: Jul 05, 2026 | 12:06 PM

సాధారణంగా పాము అనగానే అందరికీ గుర్తొచ్చేది నాగుపామే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో నాగుపాము ఒకటనేది నిజమే అయినప్పటికీ.. భారతదేశంలో అంతకంటే భయంకరమైన, అత్యంత ప్రమాదకరమైన మరో విషసర్పం ఉంది. దాన్నే కట్లపాము అంటారు. దీనిని వన్యప్రాణి నిపుణులు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. వర్షాకాలం మొదలైందంటే చాలు.. ఈ పాముల ముప్పు ఇళ్లలో చాలా ఎక్కువగా ఉంటుంది.

ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటారు?

కట్లపాము కాటు వేసినప్పుడు చాలా సందర్భాలలో బాధితులకు ఎలాంటి నొప్పి గానీ, వాపు గానీ, కనీసం కాటు వేసిన గుర్తులు గానీ స్పష్టంగా కనిపించవు. అందుకే నిద్రలో ఉన్నప్పుడు కట్లపాము కరిచినా చాలా మంది సాధారణ దోమో, చీమో కుట్టిందనుకుని నిర్లక్ష్యం చేస్తారు. కానీ దీని విషం నేరుగా మానవ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. కాటు వేసిన కొన్ని గంటల తర్వాత.. కడుపు నొప్పి, వాంతులు, తీవ్రమైన నీరసం, చూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు మొదలవుతాయి. సకాలంలో యాంటీ వెనమ్ చికిత్స అందకపోతే శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి మరణం సంభవిస్తుంది.

రాత్రిపూట ఇళ్లలోకి ఎందుకు వస్తాయి?

కట్లపాము పగటి కంటే రాత్రివేళల్లోనే అత్యంత చురుకుగా ఉంటుంది. వర్షాకాలంలో పాముల పుట్టల్లో, పొలాల్లో నీరు చేరడంతో ఇవి పొడి ప్రదేశాల కోసం వెతుకుతూ నిశబ్దంగా ఇళ్లలోకి, గిడ్డంగుల్లోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా ఇళ్లలో నేలపై చాపలు, పరుపులు వేసుకుని పడుకునే వారి వెచ్చదనం కోసం ఇవి పక్కలోకి చేరుతుంటాయి. అలాగే వర్షాకాలంలో ఇళ్ల పరిసరాల్లో ఎలుకల సంచారం పెరుగుతుంది. నాగుపాము, కట్లపాములకు ఎలుకలే ప్రధాన ఆహారం కావడం వల్ల.. ఇవి వేటాడుతూ మానవ నివాసాల వద్దకు వస్తాయి. కట్టెల కుప్పలు, పాత సామాన్లు, గోడల పగుళ్లు, పూల కుండీల చాటున ఇవి నక్కి ఉంటాయి.

దీని రూపం ఎలా ఉంటుంది?

కట్లపాము సాధారణంగా నలుపు లేదా ముదురు నీలం రంగులో ఉండి, శరీరంపై జతలుగా సన్నని తెల్లని చారలు కలిగి ఉంటుంది. ఇది సుమారు 3 నుండి 5 అడుగుల పొడవు పెరుగుతుంది. రాత్రి చీకట్లో ఈ రంగు సులభంగా కనిపించదు. భారతదేశంలో సంభవించే పాముకాటు మరణాలలో 90శాతం మరణాలకు కారణమయ్యే బిగ్ ఫోర్ జాబితాలో ఇది కూడా ఒకటి.

వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

దోమతెర తప్పనిసరి: రాత్రి నేలపై పడుకునే వారు ఖచ్చితంగా దోమతెర వాడాలి. ఇది పాములు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది.

పరిసరాల శుభ్రత: ఇళ్ల చుట్టూ చెత్తాచెదారం, కట్టెల కుప్పలు లేకుండా చూసుకోవాలి. గోడల పగుళ్లను సిమెంట్‌తో మూసివేయాలి.

చీకట్లో వెళ్లొద్దు: రాత్రిపూట బయటకు లేదా పొలాల్లోకి వెళ్లేటప్పుడు టార్చ్ లైట్ వాడటం, బూట్లు, చెప్పులు ధరించడం అలవాటు చేసుకోవాలి.

బెడ్ చెక్: పడుకునే ముందు మంచం, చాప, దుప్పట్లను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాలి.

పాము కుడితే ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఒకవేళ పాము కాటు వేస్తే అస్సలు భయపడకూడదు. బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. పాము కాటుకు యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్ ఒక్కటే ఏకైక మార్గం. నాటు వైద్యం, మంత్రాలు, మూఢనమ్మకాలను నమ్మి కాలాన్ని వృథా చేయకండి. కాటు వేసిన చోట తాడుతో గట్టిగా కట్టడం లేదా నోటితో విషాన్ని పీల్చడానికి ప్రయత్నించడం లాంటివి అస్సలు చేయకూడదు. బాధితుడిని కదలకుండా ప్రశాంతంగా ఉంచి ఆసుపత్రికి తీసుకెళ్లడం అత్యంత ముఖ్యం.

Follow Us