132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పత్రిక.. రూ.10 లక్షల ఫైన్‌ తప్పించుకున్న వ్యక్తి!

లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన ఓ పత్రిక.. కొన్నేళ్లకు కాదు, దశాబ్దాలకు కాదు.. ఏకంగా 132 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది! ఇన్నేళ్లుగా అది ఎక్కడ ఉంది? ఎవరు తీసుకెళ్లారు? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ లైబ్రరీకి ఎలా చేరింది? ఈ పత్రిక కథ వైరల్‌ గా మారింది. అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. 84 ఏళ్ల జాన్‌ హాన్సన్‌ అనే వ్యక్తి.. 1894లో లైబ్రరీ నుంచి తీసుకున్నట్లుగా గుర్తించిన ఓ పాత మ్యాగజైన్‌ను తిరిగి ఇచ్చారు. అది కూడా సాధారణ మ్యాగజైన్‌ కాదు. ఏకంగా 132 ఏళ్ల చరిత్ర ఉన్న అరుదైన ప్రచురణ!

132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పత్రిక.. రూ.10 లక్షల ఫైన్‌ తప్పించుకున్న వ్యక్తి!
Man Returns A Magazine 132 Years Late After Library Introduces No Fine Avoiding Rs. 10 Lakh Fine

Updated on: Sep 23, 2026 | 4:58 PM

హాన్సన్‌ న్యూ హాంప్‌షైర్‌లోని కాంకార్డ్‌లో నివాసం ఉంటారు. అతని వద్ద ఈ మ్యాగజైన్‌ దశాబ్దాలుగా ఉంది. మొదట అది ఆయన బాస్కోవెన్‌ ఇంట్లో ఉండేది. 2010లో ఆయన బారింగ్టన్‌కు మారినప్పుడు దాన్ని తనతో పాటు తీసుకెళ్లారు. అసలు ట్విస్ట్‌ ఏంటంటే..ఆ మ్యాగజైన్‌ తన దగ్గరకు ఎలా వచ్చిందో తనకే తెలియదని హాన్సన్‌ చెబుతున్నారు! తన తండ్రి కాంకార్డ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. ఆయనకు లైబ్రరీ కార్డు లేదని హాన్సన్‌ తెలిపారు. బహుశా పాత పుస్తకాల కుప్పలో లేదా ప్రకటనల విక్రయంలో తనకు దొరికి ఉండొచ్చని ఆయన అనుమానిస్తున్నారు. అయితే.. అసలు ఈ మ్యాగజైన్‌ను లైబ్రరీ నుంచి ఎవరు తీసుకెళ్లారు? అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు.

ఒక్కరోజు కాదు.. 48,220 రోజులు ఆలస్యం!

ఇక్కడే ఈ కథ మరింత ఆసక్తికరంగా మారింది. కాంకార్డ్‌ పబ్లిక్‌ లైబ్రరీ రికార్డుల ప్రకారం.. ఈ మ్యాగజైన్‌ ఏకంగా 48,220 రోజులు ఆలస్యంగా తిరిగి వచ్చింది. లైబ్రరీలో రోజుకు 25 సెంట్ల చొప్పున జరిమానా విధించే పద్ధతి అమల్లో ఉంటే..మొత్తం ఫైన్‌ 12,055 డాలర్లు! భారత కరెన్సీలో ఇది సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంది. 132 ఏళ్ల ఆలస్యానికి ఇంత భారీ జరిమానా! కానీ హాన్సన్‌ కు ఆ మొత్తం చెల్లించాల్సిన అవసరం రాలేదు.

ఒక్క ప్రకటన.. మ్యాగజైన్‌ను తిరిగి ఇచ్చేలా చేసింది!

2026 సెప్టెంబర్‌ 1వ తేదీన కాంకార్డ్‌ పబ్లిక్‌ లైబ్రరీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక ఏడాది పాటు లేట్‌ ఫైన్ల వసూళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. ఏళ్లుగా తమ వద్దే ఉండిపోయిన పుస్తకాలు, మ్యాగజైన్లు, ఇతర లైబ్రరీ మెటీరియల్‌ను జరిమానా భయం లేకుండా తిరిగి ఇచ్చేయాలని ప్రజలను ప్రోత్సహించింది. ఈ విషయం గురించి ఓ వార్తాపత్రికలో చదివిన హాన్సన్‌..ఇదే సరైన సమయం అనుకున్నారు. దశాబ్దాలుగా తన ఇంట్లో ఉన్న ఆ పాత మ్యాగజైన్‌ను తీసుకుని లైబ్రరీకి వెళ్లారు.

1894 పత్రికలో అసలు ఏముంది?

హాన్సన్‌ తిరిగి ఇచ్చిన మ్యాగజైన్‌ పేరు The Century Illustrated Monthly Magazine. 1894 సెప్టెంబర్‌ సంచిక ఇది. సాహిత్యం, చరిత్ర, అప్పటి సమాజానికి సంబంధించిన అంశాలతో పాటు వివిధ కథనాలతో పాటు ఆ కాలానికి చెందిన ప్రకటనలు కూడా అందులో ఉన్నాయి. మార్క్‌ ట్వెయి న్‌, హెన్రీ జేమ్స్‌ వంటి ప్రముఖ రచయితలకు సంబంధించిన రచనలు కూడా ఆ సంచికలో ఉన్నట్లు సమాచారం. అంటే.. అది కేవలం పాత మ్యాగజైన్‌ కాదు. 19వ శతాబ్దపు అమెరికా సమాజాన్ని కళ్ల ముందు నిలిపే ఓ చారిత్రక పత్రిక!

మ్యాగజైన్‌పై గుర్తులు మరో కథ చెబుతున్నాయి!

ఈ మ్యాగజైన్‌పై కాంకార్డ్‌ పబ్లిక్‌ లైబ్రరీకి సంబంధించిన పాత గుర్తులు కూడా ఉన్నాయి. లైబ్రరీ బుక్‌ప్లేట్‌తో పాటు.. “ఒక వారం పాటు మాత్రమే ఉంచుకోవాలి” అనే సూచన కూడా కనిపించింది. కానీ ఆ ‘ఒక వారం’ 132 ఏళ్లుగా సాగిపోయింది! అసలు అప్పట్లో దాన్ని తీసుకున్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి తర్వాత ఏం చేశాడు? మ్యాగజైన్‌ ఎన్ని చేతులు మారింది? చివరకు హాన్సన్‌ ఇంటికి ఎలా చేరింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.

ఇక మళ్లీ ఎవరూ ఇంటికి తీసుకెళ్లలేరు!

మ్యాగజైన్‌ తిరిగి వచ్చినప్పటికీ.. దాన్ని మళ్లీ పాఠకులకు ఇచ్చే ఆలోచన లైబ్రరీకి లేదు. దాని వయసు, చారిత్రక విలువ దృష్ట్యా ప్రత్యేకంగా భద్రపరచాలని సిబ్బంది భావిస్తున్నారు.
కాంకార్డ్‌ చరిత్రకు సంబంధించిన పాత పత్రాలను భద్రపరిచే కాంకార్డ్‌ రూమ్‌లో దీన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఒకప్పుడు లైబ్రరీ నుంచి బయటకు వెళ్లిన ఈ మ్యాగజైన్‌..
132 ఏళ్ల తర్వాత మళ్లీ అదే లైబ్రరీ చరిత్రలో భాగంగా మారబోతోంది. ఒక పాత మ్యాగజైన్‌.. ఒక శతాబ్దపు మిస్టరీ! 1894లో లైబ్రరీ నుంచి ఎవరో తీసుకున్న ఆ మ్యాగజైన్‌ ఏళ్ల తరబడి కనిపించకుండా పోయింది. దశాబ్దాలు గడిచాయి. తరాలు మారాయి. చివరకు 84 ఏళ్ల వ్యక్తి ఇంట్లో అది ప్రత్యక్షమైంది. ఓ చిన్న పుస్తకం.. ఒక భారీ జరిమానా.. ఓ శతాబ్దానికి పైగా సాగిన మిస్టరీ.. చివరకు మళ్లీ లైబ్రరీ అనే కంచికి చేరిన కథ ఇది!

 

 

 

 

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us