
ఇంట్లో వంటమనిషి ఉంటే పని సులభమవుతుంది కానీ, కొన్నిసార్లు వారు చేసే చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్లాస్టిక్ ప్యాకెట్ తీయకుండానే నేరుగా చికెన్ వండేసిన పనిమనిషి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కుక్కర్‌లో చికెన్ కూర వండుతుండటం కనిపిస్తుంది. చూడ్డానికి ఇది సాధారణ వంటలాగే అనిపిస్తుంది. కానీ నిశితంగా గమనిస్తే అందులోని చికెన్ ముక్కలు ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఫ్రిజ్‌లో ఉన్న ఫ్రోజెన్ చికెన్ ప్యాకెట్‌ను కట్ చేసి చికెన్ బయటకు తీయకుండానే, ఆ వంట మనిషి నేరుగా ప్యాకెట్‌తో సహా వండేసింది.
ఈ వీడియోను సౌరవ్ దేవ్రాని అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. తమ ఇంట్లో ఎప్పుడూ ఫ్రోజెన్ చికెన్ ఉంటుందని, వంట బాధ్యతను కుక్‌కు అప్పగించామని ఆయన తెలిపారు. అయితే చికెన్‌ను ప్యాకెట్ నుండి బయటకు తీసి వండాలని ఆమెకు చెప్పడం తాను మర్చిపోయానని తెలిపారు. ఈ తమాషా ఘటన తర్వాత ఆమెను పనిలో నుండి తీసేయాలా? అంటూ వీడియోలో సరదాగా ప్రశ్నించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆమెకు వెంటనే ఇంటర్న్‌షిప్ ఇవ్వాలి అని ఒక యూజర్ సరదాగా కామెంట్ చేయగా, దీదీని వెంటనే అరెస్టు చేయాలి అంటూ మరొకరు చమత్కరించారు. మరికొందరు మాత్రం ఇది జోక్ కాదని, ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన విషయమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వీడియో చూసి కొందరు నవ్వుకుంటున్నప్పటికీ, నిపుణుల ప్రకారం ఇది చాలా ప్రమాదకరమైన విషయం. యజమాని గమనించకుండా ఉండి, ఆ ప్లాస్టిక్ కవర్‌లో వండిన చికెన్‌ను లేదా కనీసం దాని గ్రేవీని తిన్నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడేది. అధిక వేడికి ప్లాస్టిక్ కరిగి అందులోని హానికరమైన రసాయనాలు ఆహారంలో కలుస్తాయి. ఇవి దీర్ఘకాలంలో ప్రాణాలకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఫ్రోజెన్ చికెన్ లేదా ఏ ఆహార పదార్థాన్నైనా వండే ముందు ప్యాకెట్ నుండి తీసి, సురక్షితంగా కరిగించి వండటం తప్పనిసరి.