ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!

సమయం ఉదయం 6.30 గంటలు.. జపాన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌ దగ్గర రద్దీ మొదలైంది. రైలు ఎక్కేందుకు ప్రయాణికులు హడావుడిగా పరుగులు తీస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి మాత్రం స్టేషన్‌ బయట నిలబడి ఒక్కొక్కరికి కరపత్రాలు అందిస్తున్నారు. అతడిని చాలామంది పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. కానీ ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే! అతడు సాధారణ రాజకీయ నాయకుడు కాదు. జపాన్ మాజీ ప్రధాని యోషిహికో నోడా.

ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
Japan Ex Pm Still Hands Out Flyers After 40 Years

Updated on: Sep 22, 2026 | 6:23 PM

2011 నుంచి 2012 వరకు జపాన్ ప్రధానిగా పనిచేసిన నోడా.. పదవి నుంచి తప్పుకున్న ఎన్నో ఏళ్ల తర్వాత కూడా తన పాత అలవాటును కొనసాగిస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా రైల్వే స్టేషన్ల వద్ద ప్రజలకు కరపత్రాలు పంచుతూ, వారితో నేరుగా మాట్లాడే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

సెప్టెంబర్ 18న కూడా అదే సీన్

2026 సెప్టెంబర్ 18వ తేదీన.. చిబా ప్రాంతంలోని మినామి-ఫునాబాషి రైల్వే స్టేషన్‌ వద్ద నోడా కనిపించారు. ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు ఆయన స్టేషన్‌లో నిలబడి ప్రయాణికులకు కరపత్రాలు అందించారు. ఆయన అధికారిక షెడ్యూల్‌లోనూ ఈ కార్యక్రమం నమోదై ఉంది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర విషయం ఉంది. ఒకప్పుడు జపాన్ ప్రధానిగా దేశ రాజకీయాలను నడిపిన వ్యక్తి.. ఇప్పుడు స్టేషన్‌ మెట్ల దగ్గర నిలబడి ప్రయాణికుల చేతుల్లో కరపత్రాలు పెడుతున్నారు. కొంతమంది ప్రయాణికులు అతనిని గుర్తించి కరపత్రాలు తీసుకున్నారు. మరికొందరు మాత్రం అతని పక్క నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా చర్చకు వచ్చాయి.

ఈ అలవాటు ఇప్పటిది కాదు.. 1986 నుంచే!

ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.  రైల్వే స్టేషన్‌ వద్ద కరపత్రాలు పంచడం 1986లోనే ఆయన ప్రారంభించారు. అంటే జాతీయ రాజకీయాల్లోకి రావడానికి చాలా ముందే ఆయన ఈ పద్ధతిని మొదలుపెట్టారు. 1987లో చిబా ప్రిఫెక్చర్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1993లో జపాన్ ప్రతినిధుల సభలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేసి.. 2011లో జపాన్ ప్రధానమంత్రి అయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎంత ఎత్తుకు వెళ్లినా స్టేషన్‌ వద్ద ప్రజలను కలవడం మాత్రం ఆపలేదు.

 

ప్రధాని అయిన తర్వాత కూడా మారని రొటీన్!

దేశంలో అత్యున్నత రాజకీయ పదవుల్లో ఒకటైన ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నోడా తన ప్రజా సంబంధాల పద్ధతిని కొనసాగించారు. ప్రధాని పదవిని 2012లో వదిలేసిన తర్వాత కూడా తెల్లవారుజామున స్టేషన్ల వద్ద కనిపించారు. సభలలో పాల్గొని భారీ ప్రసంగాలను ఇవ్వడం కంటే ప్రజలను నేరుగా కలవడం, కరపత్రాలను అందించడానికే ఆయన ఇష్టపడతారు.

కరపత్రాల్లో ఏముంది?

సెప్టెంబర్ 18న ఆయన పంచిన కరపత్రాల్లో స్థానిక సమస్యలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. విపత్తు బీమా, పిల్లల కోసం సహాయ కార్యక్రమాలు, ప్రిఫెక్చర్‌ సంస్కరణలను అందులో ప్రస్తావించారు. అంటే.. అది కేవలం ప్రచార కార్యక్రమం కాకుండా, స్థానిక ప్రజలతో నేరుగా సంప్రదింపులు కొనసాగించే పద్ధతిగా నోడా భావిస్తున్నారు.

స్టేషన్‌ వద్ద కనిపించిన వీడియోల్లో ఒక విషయం ప్రత్యేకంగా కనిపించింది. మాజీ ప్రధాని పక్కనే నిలబడి కరపత్రాలు ఇస్తున్నా.. చాలామంది ప్రయాణికులు తమ దారిలో తాము వెళ్లిపోయారు. ఉదయం రద్దీ సమయం కావడంతో కొందరు అతడిని గమనించలేదు. మరికొందరు మాత్రం గుర్తించి నమస్కరించి కరపత్రాలు స్వీకరించారు. ఇదే విషయం నోడా కథను ఆసక్తికరంగా మార్చింది. ఒకప్పుడు దేశ ప్రధానిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వ్యక్తి.. ఈ రోజు ఓ సాధారణ కార్యకర్తలా స్టేషన్‌ బయట నిలబడి ప్రజలను పలకరిస్తున్నారు.

నాలుగు దశాబ్దాలుగా ఒకే అలవాటు

జపాన్‌లో రైల్వే స్టేషన్ల వద్ద ప్రజలను పలకరించడం, కరపత్రాలు పంచడం రాజకీయ నాయకుల నియోజకవర్గ కార్యక్రమాల్లో సాధారణంగా కనిపించే పద్ధతే. కానీ నోడా విషయంలో ప్రత్యేకత ఏంటంటే..
ఆయన రాజకీయ జీవితంలోని దాదాపు ప్రతి దశలోనూ ఈ అలవాటు కొనసాగింది.1986లో సాధారణ రాజకీయ కార్యకర్తగా ప్రారంభించిన ప్రయాణం.. ప్రిఫెక్చర్ అసెంబ్లీ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా, చివరకు ప్రధానమంత్రిగా ఎదిగినా ఆగలేదు. అందుకే.. స్టేషన్‌ బయట కరపత్రాలు పంచుతున్న ఆ వ్యక్తిని చూసి ప్రయాణికులు పెద్దగా పట్టించుకోకపోయినా, వీడియో వైరల్ గా మారి ఆయన వెనుక ఉన్న నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణం మాత్రం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us