Video: ప్రాంక్‌తో కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తికి విరాళంగా రూ. 96 లక్షలు

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు చేసే ప్రాంక్‌లు ఇతరుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేలా ఉంటాయి. ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ సరదా కోసం చేసిన ప్రాంక్‌ సూపర్ మార్కెట్ ఉద్యోగికి ఆగ్రహం తెప్పించింది. అప్పటికే పనిభారంతో సతమతమవుతున్న అతడిని వీడియో తీస్తూ ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆ ఉద్యోగి తన కష్టాలను వెళ్లగక్కాడు.

Video: ప్రాంక్‌తో కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తికి విరాళంగా రూ. 96 లక్షలు
Influencer Pranks Worker To Breaking Point Strangers Raise Rs 96 Lakh For Him

Updated on: Nov 03, 2026 | 8:30 PM

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఇన్‌ఫ్లుయెన్సర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆ ఉద్యోగికి అండగా నిలిచేందుకు నెటిజన్లు ముందుకొచ్చారు. ఏకంగా రూ.96 లక్షలకు పైగా విరాళాలు సేకరించారు.

ఉద్యోగిని స్కాన్ చేస్తున్నట్లు నటించిన ఇన్‌ఫ్లుయెన్సర్

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అమెరికాలోని రెడ్ బారన్ సూపర్ మార్కెట్‌లో ఓ ఉద్యోగి షెల్ఫ్‌లపై సరుకులు సర్దుతుండగా ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ అతని దగ్గరకు వెళ్లాడు. తన ఫోన్ తీసి ఆ ఉద్యోగిని స్కాన్ చేస్తున్నట్లు నటించాడు. మొదట ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయానికి గురైన ఉద్యోగి.. తనను వీడియో తీస్తున్నారని గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన అనుమతి లేకుండా వీడియో తీయవద్దని, అవసరమైతే ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. అయినప్పటికీ ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం నవ్వుతూ ప్రాంక్ కొనసాగించాడు.

‘నాకు నలుగురు పిల్లలు.. ఇంటి లోన్ కూడా కట్టలేకపోతున్నా’

ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రవర్తనతో విసిగిపోయిన ఉద్యోగి తన బాధను బయటపెట్టాడు. ఇప్పటికే రోజంతా పని చేసి అలసిపోయానని, ఇంట్లో తన కోసం పిల్లలు ఎదురుచూస్తున్నారని చెప్పాడు. ‘ ఉదయం 5 గంటలకే లేచి మరికొన్ని స్టోర్లకు వెళ్లి పని చేయాలి’ అన్నాడు. ఈ ఘటన వల్ల తన ఉద్యోగానికి  ఇబ్బంది కలుగుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇన్‌ఫ్లుయెన్సర్ అతడి మాటలను తేలికగా తీసుకోవడంతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు. ‘నువ్వు ఇలాంటి వీడియోలు తీసి డబ్బులు సంపాదిస్తున్నావు. కానీ నేను నా ఇంటి లోన్ కూడా కట్టలేకపోతున్నాను.  ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇన్‌ఫ్లుయెన్సర్‌పై నెటిజన్ల ఆగ్రహం

వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓ సాధారణ ఉద్యోగి తన కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడుతుంటే, అతడిని ఇబ్బంది పెట్టి వీడియోలు తీయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నించారు. ఇలాంటి ప్రాంక్‌లను వినోదంగా చూడకూడదని, ఇతరుల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఉద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేసినందుకు అతడిపై యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కూడా పలువురు కోరారు. ఈ విమర్శలు పెరగడంతో మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోను తొలగించారు. అయితే అప్పటికే ఈ వీడియో ఇతర సోషల్ మీడియా వేదికలకు చేరుకుంది.

ఉద్యోగి కోసం రూ.96 లక్షల విరాళాలు

ఈ ఘటనలో ఉద్యోగి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన ల్యూక్ ఓకెన్‌షీల్డ్ అనే వ్యక్తి గోఫండ్‌మీ (GoFundMe) ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించాడు. ఉద్యోగికి ఆర్థికంగా కొంత అండగా నిలవాలన్నదే తన ఉద్దేశమని తెలిపాడు. ఈ ఘటన కారణంగా అతడు ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చినా, కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని అన్నాడు. తనకు ఆ ఉద్యోగి వ్యక్తిగతంగా పరిచయం లేదని, అతడికి నేరుగా డబ్బులు అందించేందుకు సంప్రదింపు వివరాల కోసం ప్రయత్నిస్తున్నానని ల్యూక్ వెల్లడించాడు. ఈ విరాళాల్లో తనకు ఎలాంటి వాటా ఉండదని కూడా స్పష్టం చేశాడు. తాజా సమాచారం ప్రకారం ఈ ఫండ్‌ రైజర్‌కు 1,01,486 డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.96.6 లక్షలు. ఓ సాధారణ ఉద్యోగి కష్టాలను చూసి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us