
ఇంట్లో వంటగది కావొచ్చు, రోజూ పనిచేసే ఆఫీస్ కావొచ్చు, షాపింగ్ మాల్స్ లేదా రద్దీగా ఉండే ఏదైనా బహిరంగ ప్రదేశం కావొచ్చు.. ఊహించని విధంగా ఒక్కసారిగా అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. మంటలు చెలరేగిన మొదటి కొన్ని నిమిషాలు అత్యంత కీలకమైనవి. ఆ సమయంలో వెంటనే స్పందించి మంటలను అదుపు చేయకపోతే.. క్షణాల వ్యవధిలోనే పెను విపత్తుగా మారి ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీస్తుంది. దాదాపు అన్ని భవనాల్లో, కార్యాలయాల్లో అత్యవసర వినియోగం కోసం ఎరుపు రంగు అగ్నిమాపక యంత్రాలు (ఫైర్ ఎక్స్‌టింగిషర్స్) అమర్చి ఉంటాయి. కానీ అత్యవసర సమయంలో వాటిని ఎలా ఆపరేట్ చేయాలో అవగాహన లేక చాలామంది భయాందోళనలకు గురవుతుంటారు. ఆ చిన్న సిలిండర్‌ను ఎలా వాడాలో తెలిస్తే భారీ ముప్పును ప్రాథమిక దశలోనే నివారించవచ్చు.
ఫైర్ ఎక్స్టింగిషర్ను అత్యవసర సమయంలో సులభంగా ఆపరేట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనే సాధారణ రూల్‌ను ఉపయోగిస్తారు. ఇందులో నాలుగు దశలు ఉంటాయి:
P – Pull: సిలిండర్ పొరపాటున లేదా అనుకోకుండా ఒత్తిడికి గురై పనిచేయకుండా ఉండేందుకు పైభాగంలో ఒక సీల్డ్ సేఫ్టీ పిన్ ఉంటుంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సిలిండర్‌ను చేతిలోకి తీసుకుని, ఆ సేఫ్టీ పిన్ను బలంగా బయటకు లాగాలి. ఈ పిన్ను తొలగిస్తేనే సిలిండర్ హ్యాండిల్ లాక్ తెరుచుకుంటుంది.
A – Aim : చాలామంది చేసే అతిపెద్ద తప్పు.. పైకి లేస్తున్న మంటలపైకి నాజిల్‌ను గురిపెట్టడం. అలా చేస్తే మంటలు అదుపులోకి రావు. సిలిండర్ పైపు నాజిల్ ను నేరుగా మంటలు ప్రారంభమైన మూలం వైపు మాత్రమే గురిపెట్టాలి. నేలపై లేదా వస్తువుపై మంట పుడుతున్న అడుగు భాగానికి గురిపెడితేనే దహన చర్య ఆగిపోతుంది.
S – Squeeze: నాజిల్‌ను సరైన చోట ఉంచిన తర్వాత, సిలిండర్ పైనున్న హ్యాండిల్ లివర్లను గట్టిగా కలిపి నొక్కాలి. ఇలా ప్రెస్ చేయగానే లోపల అధిక పీడనంతో ఉన్న వాయువు లేదా రసాయన చూర్ణం వేగంగా పైపు ద్వారా బయటకు వస్తుంది.
S – Sweep: మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు నాజిల్‌ను ఒకే చోట స్థిరంగా ఉంచకుండా.. చీపురుతో ఊడ్చినట్లు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు అటూఇటూ తిప్పుతూ ఉండాలి. మంటలు పూర్తిగా చల్లారే వరకు ఈ విధంగా స్వీప్ చేస్తూ ఉండాలి.
సరైన దూరం పాటించండి: మంటలకు మరీ దగ్గరగా వెళ్లకూడదు. ఎల్లప్పుడూ మంటలకు కనీసం 6 నుంచి 8 అడుగుల సురక్షిత దూరంలో నిలబడి ఎక్స్టింగిషర్ను ఆపరేట్ చేయాలి.
గాలి వీచే దిశను గమనించండి: బహిరంగ ప్రదేశంలో ప్రమాదం జరిగితే గాలి వీస్తున్న దిశలోనే నిలబడాలి. ఎదురుగాలిలో నిలబడితే మంటల పొగ, లోపలి నుంచి వచ్చే కెమికల్ పౌడర్ మన ముఖంపైకే పడే ప్రమాదం ఉంది.
బయటకు వెళ్లే దారిని గమనించుకోండి: మంటలు ఆర్పే క్రమంలో మన వెనుక ఎగ్జిట్ డోర్ క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మంటలు అదుపులోకి రాకపోతే వెంటనే సురక్షితంగా బయటపడటానికి ఇది అవసరం.