మీరు అస్సలు ఊహించలేరు.. ఆకాశంలో కనిపించే ఒక మేఘం బరువు ఎంత ఉంటుంది..?

ఆకాశంలో తేలియాడే తెల్లటి మేఘాలను చూసి చాలా మంది అవి అస్సలు బరువే ఉండవని అనుకుంటారు. కానీ ఒక్క మేఘం బరువు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వంద ఏనుగుల బరువును మోస్తూ ఆకాశంలో నిశబ్దంగా విహరిస్తున్న ఆ తెల్లటి మేఘాలు నేల మీద పడిపోకుండా ఎలా నిలబడుతున్నాయి? అసలు శాస్త్రవేత్తలు వీటి బరువును ఎలా లెక్కించారు? ఆ ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకుందాం..

మీరు అస్సలు ఊహించలేరు.. ఆకాశంలో కనిపించే ఒక మేఘం బరువు ఎంత ఉంటుంది..?
How Much Does A Cloud Weight

Updated on: Oct 16, 2026 | 3:50 PM

నీలిరంగు ఆకాశంలో మెత్తటి దూది పింజల్లా, తేలికగా విహరించే మేఘాలను చూసినప్పుడు ఎవరికైనా ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. గాలికి అటూఇటూ తేలిపోతుంటే వాటికి అసలు బరువే ఉండదేమో అనుకోవడం సహజం. కానీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిన వాస్తవం తెలిస్తే మాత్రం ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఆకాశంలో తేలియాడుతూ కనిపించే ఒకే ఒక్క సాధారణ మేఘం బరువు అక్షరాలా 5 లక్షల కిలోలు (సుమారు 500 టన్నులు) ఉంటుంది. అంటే దాదాపు 100 నిండు ఏనుగుల బరువుకు సమానం. నమ్మశక్యంగా లేకపోయినా ఇది ముమ్మాటికీ నిజం. మరి అంత భారీ బరువున్న మేఘం భూమి మీద పడిపోకుండా గాల్లోనే ఎలా తేలుతోంది? అసలు శాస్త్రవేత్తలు మేఘం బరువును ఎలా కొలిచారు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

మేఘం బరువును శాస్త్రవేత్తలు ఎలా లెక్కిస్తారు?

వాతావరణ శాస్త్రవేత్తలు సాధారణంగా ఆకాశంలో తెల్లగా, గుండ్రంగా కనిపించే క్యుములస్ మేఘాలను ప్రామాణికంగా తీసుకుంటారు. నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ పరిశోధకుల ప్రకారం మేఘం బరువును ఇలా గణిస్తారు.

మేఘం పరిమాణం: ఒక సాధారణ క్యుములస్ మేఘం సుమారు 1 కిలోమీటరు పొడవు, 1 కిలోమీటరు వెడల్పు, 1 కిలోమీటరు ఎత్తు ఉంటుంది. అంటే దాని ఘనపరిమాణం దాదాపు 1 బిలియన్ క్యూబిక్ మీటర్లు.

నీటి సాంద్రత: అలాంటి మేఘంలో ప్రతి క్యూబిక్ మీటర్‌కు సుమారు 0.5 గ్రాముల నీటి ఆవిరి, మైక్రోస్కోపిక్ నీటి బిందువులు ఉంటాయి.

మొత్తం బరువు: ఈ లెక్కన 1 బిలియన్ క్యూబిక్ మీటర్లను 0.5 గ్రాములతో గుణిస్తే వచ్చే మొత్తం బరువు దాదాపు 5,00,000 కిలోలు.

అంత బరువున్నా మేఘాలు కిందపడకుండా ఎలా తేలుతాయి?

5 లక్షల కిలోల బరువు ఉన్నప్పుడు అది వేగంగా భూమిని తాకాలి కదా? ఇక్కడే ప్రకృతిలోని అద్భుతమైన సైన్స్ దాగుంది. మేఘంలో నీరు ఒకే చోట ముద్దలా ఉండదు. బిలియన్ల కొద్దీ అతి సూక్ష్మమైన నీటి బిందువులు, మంచు స్పటికాల రూపంలో కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ బిందువులు ఎంత చిన్నవంటే.. సాధారణ కంటికి కూడా కనిపించవు. భూమి వేడెక్కినప్పుడు నేల నుంచి పైకి లేచే వెచ్చని గాలి ప్రవాహాలు నిరంతరం మేఘాన్ని పైకే నెడుతుంటాయి. మేఘంలోని నీటి బిందువుల మొత్తం సాంద్రత కంటే దాని కింద ఉండే పొడి గాలి సాంద్రత చాలా ఎక్కువ. నీటిపై తేలియాడే కర్రలాగే.. ఎక్కువ సాంద్రత గల గాలిపై తక్కువ సాంద్రత కలిగిన తేలికపాటి బిందువులు గాల్లోనే తేలియాడుతుంటాయి.

వర్షం ఎలా పడుతుంది?

ఎప్పుడైతే ఆ సూక్ష్మ నీటి బిందువులు చల్లబడి ఒకదానితో ఒకటి కలిసి బరువైన నీటి చుక్కలుగా మారతాయో, అప్పుడు గాలి వాటిని ఇక మోయలేకపోతుంది. గ్రావిటీ ప్రభావంతో ఆ నీరంతా వర్షపు జల్లులుగా భూమిని ముద్దాడుతుంది. ఇక భారీ తుఫానులు, ఉరుములు తెచ్చే క్యుములోనింబస్ మేఘాల బరువు అయితే లక్షలాది టన్నుల వరకు ఉంటుంది. దూదిలా కనిపించే ఆకాశపు మేఘాల వెనుక ఇంతటి భారీ బరువు, బలమైన సైన్స్ దాగుండటం నిజంగా ప్రకృతి వింతే కదా.

Loading...
Unable to load recommendations.
Follow Us