
వ్యక్తిగత పరిశుభ్రతలో గోళ్ల సంరక్షణ చాలా ముఖ్యం. గోళ్లలో పేరుకుపోయే మురికి, బ్యాక్టీరియా వల్ల అనేక అనారోగ్య సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవడానికి అందరం నెయిల్ కట్టర్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే చూడటానికి ఎంతో చిన్నదిగా, సాధారణంగా కనిపించే నెయిల్ క్లిప్పర్ కేవలం గోళ్లు కత్తిరించడానికి మాత్రమే పరిమితం కాదని, దాని డిజైన్‌లో ఎన్నో ఉపయోగకరమైన అదనపు సాధనాలు దాగి ఉన్నాయని చాలామందికి తెలియదు. మార్కెట్లో నెయిల్ కట్టర్స్‌లోని కొన్నింటిలో కేవలం గోళ్లు కత్తిరించే బ్లేడు మాత్రమే ఉంటే.. చాలా నెయిల్ కట్టర్లలో అదనంగా చిన్న చిన్న లోహపు పరికరాలు కూడా అమర్చి ఉంటాయి. సాధారణంగా కనిపించే గరుకు భాగం గోళ్లు కత్తిరించిన తర్వాత మారిన అంచులను నునుపుగా మార్చేందుకు తోడ్పడుతుంది. అయితే దీనితో పాటే లోపల మడతపెట్టి ఉండే మరో రెండు చిన్న పరికరాలు దేనికి ఉపయోగపడతాయో చాలామంది పట్టించుకోరు.
నెయిల్ కట్టర్‌ను పూర్తిగా తెరిచి చూస్తే అందులో చిన్న కత్తి లాంటి పరికరం కనిపిస్తుంది. అత్యవసర సమయాల్లో చిన్న పండ్లను కట్ చేసుకోవడానికి, పార్సిల్స్ లేదా టేపులను ఓపెన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఏదైనా పల్చటి వస్తువులకు చిన్న రంధ్రాలు చేయడానికి కూడా ఈ పదునైన భాగాన్ని వాడవచ్చు.
ఇక రెండో పరికరం కాస్త వంపు తిరిగి, ప్రత్యేకమైన డిజైన్‌తో ఉంటుంది. ఇది కూల్‌డ్రింక్ బాటిళ్లు, గాజు సీసాల గట్టి మూతలను సులభంగా తీసే బాటిల్ ఓపెనర్‌లా పనిచేస్తుంది. దీని కొన భాగం కాస్త సూదిగా ఉండటం వల్ల చాలామంది గోళ్ల లోపల పేరుకుపోయిన మురికిని బయటకు తీసి శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇలా శుభ్రం చేసేటప్పుడు చర్మానికి లేదా గోరుకు గాయం కాకుండా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.
మనం కేవలం గోళ్లు కత్తిరించే ఒక సాధారణ వస్తువుగా భావించే నెయిల్ కట్టర్.. నిజానికి రోజువారీ అత్యవసర సమయాల్లో ఎన్నో పనులను సులభతరం చేసే ఒక మినీ మల్టీ టూల్ కిట్ అని అనడంలో ఎలా సందేహం లేదు.