
గ్వాటెమాలాకు చెందిన యులీడీ అనే 15 ఏళ్ల బాలిక శనివారం తన తండ్రితో కలిసి కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో పాస్టర్ అయిన ఆమె తండ్రి అబ్రహం వెంటనే కారును పక్కకు ఆపి కుమార్తె పరిస్థితిని పరిశీలించారు. ఆమె శ్వాస తీసుకోవడం లేదని, మణికట్టు వద్ద నాడి కొట్టుకోవడం లేదని గమనించి తన కుమార్తె చనిపోయిందని భావించి బాలికను వైద్యుడికి చూపించలేదు. కుటుంబ సభ్యులు ఆమె చనిపోయిందని శవపేటికను కొనుగోలు చేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
ఎల్ జోకోట్ ప్రాంతంలోని వారి ఇంటి వద్ద బాలిక అంత్యక్రియల కోసం బంధువులు, స్నేహితులు గుమిగూడారు. కుమార్తె మరణించిందనే బాధతో ఆమె తల్లి లెస్వియా రియోస్ శవపేటికపై వాలి కన్నీరుమున్నీరుగా విలపించింది. అంతలో శవపేటికలో కుమార్తె కదులుతున్నట్లు గమనించింది. మొదట ఆశ్చర్యపోయిన ఆమె.. వెంటనే శవపేటిక మూతను తెరిచారు. అంతే.. బాలిక కదులుతూ కనిపించింది. శవపేటిక మూత తెరిచి చూడగా బాలిక కళ్లుతెరిచి ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడున్నవారంతా నమ్మలేకపోయారు. కొద్దిసేపటి క్రితం వరకు విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు ఆనందంతో కేకలు వేశారు. బాలికను శవపేటిక నుంచి బయటకు తీసుకురావడానికి సహాయం చేసి ఆమెకు నీళ్లు అందించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Una joven de 15 años fue dada por muerta y despertó en su ataúd tras ocho horas en un velorio en Guatemala https://t.co/bI58jZJfax
— Errete en Español (@erreteespanol) October 11, 2026
తన కుమార్తె చనిపోలేదని తాను పలుమార్లు చెప్పానని తల్లి లెస్వియా స్థానిక మీడియాకు తెలిపారు.’ఆమె చనిపోలేదు బతికే ఉందని చెబుతూనే ఉన్నాను. శవపేటికపై వాలి ఏడుస్తున్న సమయంలో కదలికలు గుర్తించాను .. ఆమె మేల్కొంది ఒక్కసారిగా లేచి కూర్చుంది’ అని చెప్పారు. చనిపోయిందనుకున్న కుమార్తె తిరిగి కళ్లముందు కనిపించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్పృహ కోల్పోయే ముందు గుండె నొప్పి వచ్చిందని ఒక్కసారిగా స్పృహ తప్పినట్లు బాలిక యులీడీ తెలిపింది. తను బతికే ఉండటం ఒక అద్భుతమని భావోద్వేగానికి గురైంది.
కారులో తన కుమార్తె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదని తండ్రి అబ్రహం అంగీకరించారు. కారు ఆపి ఆమె పరిస్థితిని పరిశీలించానని, శ్వాస తీసుకోవడం లేదని, నాడి కూడా కొట్టుకోవడం లేదని గమనించి ఆమె చనిపోయిందని భావించినట్లు తెలిపారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే అత్యవసర వైద్య సహాయం కోసం బాలికను ఆసుపత్రికి తరలించాలన్న ఆలోచన ఆయనకు ఆ సమయంలో రాకపోవడం విచారకరం. ఏదేమైనా అంత్యక్రియలకు ముందు బాలిక తిరిగి స్పృహలోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.