Snakes: పాముల రహస్య ప్రపంచం.. అవి పిల్లల్ని కనడం గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..

ప్రపంచంలో పాముల జీవిత చక్రం అత్యంత విచిత్రమైనది. ముఖ్యంగా వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయం పాముల సంతానోత్పత్తికి అత్యంత కీలకమైనది. అయితే అన్ని పాములు ఒకేలా పిల్లలను కంటాయా? గుడ్లు పెట్టే పాములకు, నేరుగా పిల్లల్ని కనే పాములకు ఉన్న తేడా ఏంటి? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Snakes: పాముల రహస్య ప్రపంచం.. అవి పిల్లల్ని కనడం గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..
The Surprising Truth About Snake Births

Updated on: Jun 04, 2026 | 1:10 PM

వర్షాకాలం మొదలైందంటే చాలు పొలాలు, అడవులు, చివరకు జనావాసాల్లోకి కూడా పాములు రావడం మొదలవుతుంది. సాధారణంగా పాము కనిపిస్తేనే మనం భయంతో వణికిపోతాం. కానీ వన్యప్రాణి నిపుణుల ప్రకారం.. పాముల జీవితంలో వర్షాకాలం అత్యంత కీలకమైన సమయం. ఎందుకంటే ఇవి సంతానోత్పత్తి చేసేది ఈ కాలంలోనే. అయితే పాముల జనన రహస్యాలు, వాటి పేరెంటింగ్ స్టైల్స్ వెనుక ఎవరికీ తెలియని ఎన్నో వింతలు, విచిత్రాలు దాగున్నాయి. అవును పాములు క్షీరదాలు కావు.. అవి సరీసృపాల కుటుంబానికి చెందినవి. బల్లులు, పాములు పిల్లల్ని కనే విధానంలో చాలా పోలికలు ఉంటాయి. ప్రముఖ పాముల నిపుణుడు డాక్టర్ టి.ఎస్. శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. పాములలో రెండు రకాలుగా సంతానోత్పత్తి జరుగుతుంది.

రెండు రకాలుగా

గుడ్లు పెట్టేవి: ప్రపంచంలోని మెజారిటీ పాములు గుడ్లు పెడతాయి. ఆడ పాము తన గుడ్లను శత్రువుల బారిన పడకుండా దాచడానికి సురక్షితమైన, వెచ్చని ప్రదేశాన్ని వెతుక్కుంటుంది. కొన్ని పాములు గుడ్ల చుట్టూ తమ శరీరాన్ని చుట్టుకుని ఉష్ణోగ్రతను అందిస్తాయి. పాము జాతిని బట్టి ఈ గుడ్లు పొదగడానికి 15 రోజుల నుండి 2 నెలల సమయం పడుతుంది.

పిల్లలకు జన్మనిచ్చేవి: కొన్ని పాములు నేరుగా పిల్లలకే జన్మనిస్తాయి. అయితే ఇది మనుషులు లేదా జంతువుల లాగా జరగదు. పాము శరీరం లోపలే గుడ్లు ఏర్పడతాయి. ఆ గుడ్లు తల్లి గర్భంలోనే పూర్తిగా అభివృద్ధి చెంది, అక్కడే పగిలిపోతాయి. ఆ తర్వాత పిల్లలు నేరుగా తల్లి శరీరం నుండి బయటకు వస్తాయి. బయటి ప్రపంచానికి ఇది చూసేటప్పుడు పాము పిల్లల్ని కంటున్నట్టు అనిపిస్తుంది.

గూడు కట్టే ఏకైక పాము.. కింగ్ కోబ్రా

పాముల ప్రపంచంలో కెల్లా అత్యంత ఆశ్చర్యకరమైన, బాధ్యతాయుతమైన ప్రవర్తన రాచనాగుది. ప్రపంచంలోనే గూడు కట్టుకునే ఏకైక పాము జాతి ఇదే. మగ, ఆడ రాచనాగులు కలిసి ఎండు ఆకులు, చిన్న చిన్న కొమ్మలతో ఒక అద్భుతమైన గూడును నిర్మిస్తాయి. ఆడ రాచనాగు ఆ గూట్లో గుడ్లు పెట్టి, అవి పొదిగే వరకు రాత్రి పగలు తేడా లేకుండా కాపలా కాస్తుంది. పాముల ప్రపంచంలో ఇలా గుడ్లను గూడు కట్టి కాపాడుకోవడం అనేది అత్యంత అరుదైన, విలక్షణమైన చర్య.

పుట్టగానే వేట మొదలు..

సాధారణంగా వేసవి ముగింపు, వర్షాకాలం ప్రారంభ సమయం పాముల జననానికి బెస్ట్ టైమ్. చాలా పాములు ఒకేసారి 3 నుండి 10 వరకు గుడ్లు లేదా పిల్లలను పెడతాయి. గుడ్లు పొదిగి పిల్లలు బయటకు వచ్చిన మరుక్షణమే.. వాటికి తల్లితో ఎలాంటి సంబంధం ఉండదు. అవి స్వతంత్రంగా జీవించడం, వేట ఆడటం మొదలుపెడతాయి. అయితే ప్రకృతి నియమం ప్రకారం.. ఒక్కోసారి ఆహార కొరత ఏర్పడినప్పుడు లేదా వాటి సహజ సిద్ధమైన క్రూర ప్రవర్తన కారణంగా తల్లి పాములు తమ సొంత పిల్లలనే ఆహారంగా తీసుకుంటాయి.

పాములు మనకు ముప్పు వాటిల్లుతుందని భావిస్తే తప్ప, మనుషులపై దాడి చేయవు. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో పొలాల్లో ఎలుకలను అదుపు చేయడంలో పాములు రైతులకు ఎంతో మేలు చేస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us