
కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ సంస్థలకు చెందిన అనేక H-1B పిటిషన్లు నిర్ణీత సమయంలో ఆమోదం పొందడం లేదు. ఈ మూడు సంస్థలు H-1B వీసాలను ఎక్కువగా స్పాన్సర్ చేసే కంపెనీల్లో ఉన్నాయి. ప్రస్తుతం వీటి ఉద్యోగుల వీసా పొడిగింపులు, ఉద్యోగ మార్పులకు సంబంధించిన పిటిషన్లు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం (USCIS) వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
మొదట కాగ్నిజెంట్‌కు ఈ సమస్య ఎదురైంది. ఆ సంస్థ H-1B వీసా పొడిగింపుల కోసం దరఖాస్తు చేయడంతోపాటు, త్వరితగతిన నిర్ణయం తీసుకునేందుకు ప్రీమియం ప్రాసెసింగ్‌ను కోరినప్పటికీ.. అనుకున్న సమయంలో ఆమోదం రాలేదు. ఇప్పుడు ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్‌కు చెందిన పిటిషన్లలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
వీసా పిటిషన్లు ఆమోదం పొందడంలో జాప్యం ఎందుకు జరుగుతోందనే దానిపై అమెరికా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన వివరణ లేదు. అయితే, గతంలో జరిగిన ఉద్యోగుల తొలగింపులు, H-1B వీసాల పొడిగింపులు, వీసా మోసాలకు సంబంధించిన ఆరోపణలపై జరుగుతున్న పరిశీలన ఈ జాప్యానికి కారణమై ఉండవచ్చని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అయితే, ఈ మూడు కంపెనీల పిటిషన్లపై జాప్యం ఏదైనా విచారణలో భాగమా? లేక ఇతర కారణాల వల్ల జరుగుతోందా? అనేది స్పష్టం కాలేదు. ఈ జాప్యం ఇక్కడితో ఆగకపోవచ్చని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలను ట్రంప్ ప్రభుత్వ వైఖరితో ముడిపెట్టి చూస్తున్నారు కొందరు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా కార్యక్రమాన్ని కొనసాగించడం పట్ల ఆసక్తి కనబరచడం లేదనీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా H-1B వీసా కార్యక్రమాన్ని ముగించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
H-1B వీసా పొడిగింపు కోసం ఎదురుచూస్తున్నవారికి లేదా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారాలనుకుంటున్నవారికి ఈ జాప్యం ఇబ్బందిగా మారింది. ఉద్యోగ మార్పు, వీసా గడువు, కొత్త సంస్థలో చేరే తేదీ వంటి అంశాలపై అనిశ్చితి ఏర్పడుతోంది. ప్రీమియం ప్రాసెసింగ్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిర్ణయం ఆలస్యం కావడం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే, పిటిషన్ పెండింగ్‌లో ఉండటం అంటే వీసా తిరస్కరణకు గురైనట్లుగా భావించకూడదు.
మొత్తంగా చూస్తే.. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ సంస్థలకు చెందిన H-1B పిటిషన్లపై జాప్యం ఎందుకు జరుగుతోందన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రభుత్వ విధానాలు, విచారణలు, ఇతర పరిపాలనా కారణాలు ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. అప్పటివరకు అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులు తమ వీసా స్థితిని జాగ్రత్తగా గమనించడం, అవసరమైతే ఇమ్మిగ్రేషన్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.