జలకన్యలు నిజంగానే ఉన్నాయా..! ఆ రహస్య జీవుల గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..

సగం మనిషి.. సగం చేప రూపంలో ఉండే జలకన్యల కథలు మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. ప్రఖ్యాత నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ సైతం తాను జలకన్యలను చూశానని రికార్డుల్లో రాశాడు. మరి వేల సంవత్సరాలుగా సముద్రపు లోతుల్లో దాగున్న ఈ రహస్యం ఏంటి? సైన్స్ ఈ జలకన్యల ఉనికిని ఎందుకు కొట్టిపారేస్తోంది? ఆ ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జలకన్యలు నిజంగానే ఉన్నాయా..! ఆ రహస్య జీవుల గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..
Are Mermaids Real Or Fake

Updated on: May 20, 2026 | 9:14 AM

సముద్రపు లోతుల్లో పొడవాటి జుట్టు, చేప తోకలతో ఉండే అందగత్తెలు.. వారి మధురమైన పాటల మాయలో పడి ఓడలు దారి తప్పిపోవడం.. చిన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పిన కథల్లో ఇవన్నీ వినే ఉంటాం. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా లిటిల్ మెర్మెయిడ్ నుండి మన జానపద కథల వరకు జలకన్యల ప్రపంచం ఒక అద్భుతమైన మిస్టరీ. సోషల్ మీడియాలో కూడా నిజమైన జలకన్య దొరికింది అంటూ అప్పుడప్పుడు కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇంతకీ, జలకన్యలు నిజంగానే ఉన్నాయా? ఉంటే ఏ సముద్రంలో ఉన్నాయి? ఈ విషయంలో సైన్స్ ఏం చెబుతోంది? వేల సంవత్సరాలుగా మానవుడిని వేధిస్తున్న ఈ రహస్యమయమైన ప్రశ్నకు శాస్త్రీయ సమాధానాలు ఇప్పుడు చూద్దాం…

చరిత్ర ఏం చెబుతోంది?

జలకన్యల గురించిన మొదటి ప్రస్తావన ప్రాచీన అస్సిరియాలో (క్రీ.పూ. 1000) కనిపిస్తుంది. అక్కడ అటార్గాటిస్ అనే దేవత, అనుకోకుండా తన ప్రేమికుడిని చంపిన పశ్చాత్తాపంతో చేపగా మారాలని కోరుకుంటుంది. కానీ ఆమెకున్న దైవిక శక్తుల వల్ల పూర్తిగా చేపగా మారలేక, సగం మనిషిగా.. సగం చేపగా ఉండిపోతుంది. అలాగే గ్రీకు పురాణాలలో వీరిని సైరన్లు అని పిలిచేవారు. వీరు తమ అందంతో, పాటలతో నావికులను తప్పుదోవ పట్టించి ఓడలను ముంచేస్తారని వారు నమ్మేవారు.

సైన్స్ ఏమంటోంది? అసలు నిజం ఏంటి?

జలకన్యలు నిజంగా ఉన్నాయా అనే ప్రశ్నకు శాస్త్రం ఇచ్చే సూటిగట్టి సమాధానం…లేదు. యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, సముద్రంలో సగం మనిషి, సగం చేప ఆకారంలో ఉండే జీవులు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. మరి నావికులు తాము జలకన్యలను చూశామని ఎందుకు చెప్పారు? అనే దాని వెనక శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు. సముద్రంలో డుగాంగ్‌లు, మనాటీలు అనే వింత జీవులు ఉంటాయి. ఇవి దాదాపు మనుషుల పరిమాణంలోనే ఉంటాయి. దూరం నుండి చూసినప్పుడు.. ముఖ్యంగా ఇవి శ్వాస తీసుకోవడానికి నీటి ఉపరితలంపైకి వచ్చినప్పుడు లేదా తమ పిల్లలను ఛాతీకి హత్తుకుని ఈదుతున్నప్పుడు నావికులకు మనుషుల్లాగే భ్రమ కలిగించేవి.

క్రిస్టోఫర్ కొలంబస్ డైరీ సీక్రెట్

ప్రఖ్యాత నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ సైతం 1493లో తాను జలకన్యలను చూశానని తన డైరీలో రాశాడు. కానీ కథలలో చెప్పినంత అందంగా అవి లేవు, కాస్త వింతగా ఉన్నాయి అని తెలిపాడు. అంటే కొలంబస్ చూసింది జలకన్యలను కాదు… నిజానికి మనాటీ అనే సముద్ర జీవులను.

కథల నుండి అక్వేరియంల వరకు..

నేడు జలకన్యలు కేవలం పురాణాలకే పరిమితం కాలేదు. హన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ రాసిన ది లిటిల్ మెర్మైడ్ కథ, ఆ తర్వాత వచ్చిన డిస్నీ సినిమాలు వీటికి విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఎంతగా అంటే నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద పెద్ద అక్వేరియంలలో స్విమ్మర్స్ జలకన్యల వేషధారణలో నీటి అడుగున అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ సందర్శకులను అలరిస్తున్నారు.

80 శాతం సముద్రం ఇంకా మిస్టరీనే

ప్రస్తుతానికైతే మత్స్యకన్యల ఉనికిని సమర్థించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువల్ల ఇవి కేవలం కథలు, సినిమాలు, ఊహలకే పరిమితం. అయితే శాస్త్రవేత్తలు ఒక మాట చెబుతున్నారు… భూమిపై ఉన్న సముద్రాల లోతుల్లో దాదాపు 80 శాతాన్ని మానవులు ఇంకా అన్వేషించనే లేదు.. ఆ చీకటి ప్రపంచంలో ఎలాంటి వింత జీవులు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఎవరికి తెలుసు? రేపు భవిష్యత్తులో మనం ఎలాంటి కొత్త జీవులనైనా కనుగొనవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us