15 రోజులైనా భారత గూఢచారుల జాడలేదు! ‘నా కెరీర్‌ ముగిసిందనుకున్నా’ – అజిత్ ధోవల్‌

అది ఆయన కెరీర్‌ తొలినాళ్లు. సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన పంపిన ఇంటెలిజెన్స్‌ బృందం అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఐదు రోజులు.. పది రోజులు.. 15 రోజులు గడిచినా వారి జాడ లేదు. చివరకు వచ్చిన సమాచారం ఆయనను షాక్‌కు గురిచేసింది. ఆ బృందం చైనా బలగాల అదుపులో ఉంది! ఈ ఘటన తన కెరీర్‌ను ముగించేస్తుందని అప్పట్లో భావించానని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ గుర్తుచేసుకున్నారు.

15 రోజులైనా భారత గూఢచారుల జాడలేదు! ‘నా కెరీర్‌ ముగిసిందనుకున్నా’ - అజిత్ ధోవల్‌
Ajit Doval Recalls Indian Intel Team Captured By China

Updated on: Sep 23, 2026 | 5:33 PM

ఐఐటీ రూర్కీ  స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ధోవల్.. తన కెరీర్‌లో ఎదురైన కీలక ఘట్టాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. సిక్కింలో యువ ఐపీఎస్‌ అధికారిగా పనిచేశానని చెప్పారు.  సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెట్టడం, చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (PLA) కదలికలను గమనించడం తన బాధ్యతల్లో భాగమని చెప్పారు. ఆ సమయంలో సరిహద్దు ప్రాంతానికి ఓ ఇంటెలిజెన్స్‌ బృందాన్ని పంపించారట.

చైనాకు చిక్కిన భారత గూఢచారులు

ఆ బృందం కొన్ని రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది. కానీ అనుకున్న సమయం దాటిపోయింది. రోజులు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేదు.“ఐదు రోజులు గడిచాయి.. ఆ తర్వాత పది రోజులు.. చివరకు 15 రోజులు కూడా గడిచాయి” అని ధోవల్‌ గుర్తుచేసుకున్నారు. బృందం ఎందుకు తిరిగి రాలేదో తెలియక ఆందోళన చెందారట. మంచు చరియలు విరిగిపడటం లేదా మరేదైనా ప్రమాదం జరిగిందన్న సమాచారం కూడా రాలేదట.

ఒక్క ఫోన్‌కాల్‌తో అసలు విషయం..

ఇంతలో హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ధోవల్‌కు ఫోన్‌ వచ్చింది. “మీరు కొంతమందిని సరిహద్దు అవతలికి పంపించారా?” అని ఉన్నతాధికారి ప్రశ్నించారు. వారు ఐదారు రోజుల్లో తిరిగి రావాల్సి ఉందని ధోవల్‌ చెప్పారు. “ఆ బృందం చైనా బలగాల అదుపులో ఉంది” అన్నారట ఆ అధికారి. చర్చలు, సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందం ద్వారా సిబ్బందిని భారత్‌కు తిరిగి తీసుకువచ్చినట్లు ధోవల్‌ తెలిపారు. అయితే వారు తిరిగి వచ్చిన తీరు తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.

“వారు పూర్తిగా కుంగిపోయి.. చాలా దారుణ స్థితిలో తిరిగి వచ్చారు” అని ధోవల్‌ గుర్తుచేసుకున్నారు.
‘నా కెరీర్‌ ఇక్కడితో ముగిసిపోయిందనుకున్నా,’ అన్నారు. ఈ ఘటన తర్వాత విచారణ మొదలైంది.
“ఇదే నా కెరీర్‌కు ముగింపు అని నాకు తెలుసు. నేను ఇంకా 20ల్లోనే ఉన్నాను. ఇక కొత్త కెరీర్‌ ప్రారంభించాల్సిందే అనుకున్నాను” అని ఆయన గుర్తుచేసుకున్నారు. కానీ విచారణలో ధోవల్‌ తప్పు చేసినట్లు తేలలేదు.

మ్యాపులు, స్కెచ్‌లలో లోపాలే కారణమా?

విచారణలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. బృందానికి హెడ్‌క్వార్టర్స్‌ నుంచి అందించిన స్కెచ్‌లు, మ్యాపుల్లో లోపాలు, తప్పులు ఉన్నట్లు గుర్తించారు. అదే ఈ ఘటనకు దారితీసిన కారణాల్లో ఒకటిగా తేలిందని ధోవల్‌ తెలిపారు. చివరకు విచారణ ముగిసినా తనపై ఎలాంటి తప్పిదం మోపలేదని ఆయన చెప్పారు. ఒకప్పుడు తన కెరీర్‌ ముగిసిపోయిందనుకున్న ఆ ఘటన.. చివరకు తన జీవితంలో ఒక కీలక అనుభవంగా మిగిలిపోయిందని ధోవల్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us