మిగిలింది ఒక్కరోజే.. ఇంకా తేలని టిక్కెట్ల తకరారు… అభ్యర్థుల ఎంపికలో పార్టీల మల్లగుల్లాలు..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో వేడి జోరందుకుంది. నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజే గడువు ఉండటంతో అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు హడావుడిగా ఉన్నాయి.

మిగిలింది ఒక్కరోజే.. ఇంకా తేలని టిక్కెట్ల తకరారు... అభ్యర్థుల ఎంపికలో పార్టీల మల్లగుల్లాలు..
Follow us

|

Updated on: Nov 19, 2020 | 8:15 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో వేడి జోరందుకుంది. నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజే గడువు ఉండటంతో అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు హడావుడిగా ఉన్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో చతుర్ముఖ పోటీ జరిగే అవకాశం కనిపిస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

ఏ ఎన్నికల్లోనైనా రాజకీయ చతురత కనిబరిచే కేసీఆర్‌.. ఇప్పుడు అధికారంలో ఉండడంతో వ్యూహలకు మరింత పదును పెడుతున్నారు. ఓవైపు ప్రతిపక్షాలు అభ్యర్థులు అయోమయానికి గురవుతుంటే.. ఏ వార్డు ఏ కేటగిరి అన్న సమాచారం ఉన్న టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి దిగింది. ‘యు కెన్‌ ప్రొసీడ్‌’ అంటూ కొన్ని డివిజన్లకు సంబంధించి టికెట్‌ ఇవ్వాలనుకునే నేతలకు అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో బస్తీలో ఆ నేతలు పాదయాత్రలూ ప్రారంభించారు. మొదటి నుంచి బల్దియా ఎన్నికలపై ప్రత్యేక నజర్ పెట్టిన టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనలోనూ ముందు వరుసలో ఉంది. బుధవారం 105 అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్.. ఇవాళ మరో 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మరో 25 మంది అభ్యర్థులను కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు దొరక్క సతమతం అవుతున్నాయి.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఎన్నికల ప్రకటనతోనే ఆయోయంలో పడిపోయింది. అయినా, యుద్ధానికి సిద్దమంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక కమిటీని నియమించారు. అశావహుల నుంచి బయోడేటాల స్వీకరణ ఇక కొనసాగిస్తోంది. అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేయాల్సి ఉండడంతో.. సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇదిలావుంటే, బుధవారం 47 మంది అభ్యర్థుల జాబితాను రెండు విడతలుగా విడుదల చేసి కాంగ్రెస్ మిగిలిన 103 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారుపై కుస్తీ పడుతోంది. మరోవైపు నామినేషన్ కు గడువు సమీపిస్తుండటంతో అశావాహుల్లో టెన్షన్ నెలకొంది.

మరోవైపు, టీఆర్ఎస్ పార్టీ తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న భారతీయ జనతాపార్టీ అభ్యర్థుల ఎంపికలో మాత్రం బాగా వెనుకబడింది. ఇప్పటి వరకు కేవలం 21 వార్డులకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 129 వార్డుల అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో పాటు పార్టీ ముఖ్యనేతలంతా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపుతామంటూ.. చివరికల్లా చతికిలాపడుతోంది. అయితే, అసంతృప్తుల బెడద నుండి తప్పించుకునేందుకు బీజేపీ కొత్త అలోచన చేసినట్లు కనిపిస్తుంది. పార్టీ జాబితా ప్రకటించనప్పటికీ అశావహులైన అభ్యర్థులను నామినేషన్ వేసుకోమని సూచిస్తోంది బీజేపీ అధిష్టానం. ఎప్పుడైనా పిలిచి బి – ఫారం ఇస్తామని చెప్తున్నారు బీజేపీ నేతలు. బీ ఫారం ఇచ్చేందుకు 22వ తేదీ వరకు గడువుండటంతో పార్టీలో తిరుగుబాటు లేకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇక, హైదరాబాద్ పాతబస్తీపై మంచి పట్టు పార్టీ ఎంఐఎం. ఇంతవరకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో, అభ్యర్థుల్లో మరింత టెన్షన్ పెరిగిపోయింది. అయితే, ఈరోజు అర్ధరాత్రికి ఎంఐఎం తమ అభ్యర్దుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుంటే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గడువు కుదించటంతో అసలు సమస్య తలెత్తిందని ప్రతిపక్ష పార్టీల నేతలంటున్నారు. గతంలో 21 రోజులు ఉన్న గడువును.. 15 రోజులకు కుదిస్తూ.. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ 1955 సెక్షన్‌ 33ను సవరిస్తూ పురపాలక శాఖ 2016 లో ఉత్త ర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. నామినేషన్ల స్వీకరణ మొదలు.. పరిశీలన, ఉపసంహరణ, ప్రచారం వరకు అన్ని వ్యవధులూ తగ్గాయి. ప్రస్తుత సవరణ ప్రకారం… మూడు రోజులు నామినేషన్‌ స్వీకరణ, ఒకరోజు పరిశీలన, ఒక రోజు ఉపసంహరణకు గడువు ఉంటుంది. మిగతా 9 రోజుల్లో ఏడు రోజులు ప్రచారానికి అవకాశం ఉంటుంది. ఎన్నికల నియామవళి ప్రకారం పోలింగ్‌కు రెండు రోజుల ముందు సాయంత్రం 5గంటలకే ప్రచారం నిలిపివేయాలి. దీంతో మొత్తంగా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారాని కి అభ్యర్థులకు మిగిలేది ఏడు రోజులు మాత్రమే.

గతంలో నోటిఫికేషన్‌, పోలింగ్‌కు కనీసం 21 రోజుల సమయం ఉండేది. నాలుగు రోజులు నామినేషన్ల స్వీకరణ, రెండు రోజులు పరిశీలనకు , ఒకరోజు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చేవారు. మిగిలిన 14 రోజుల్లో 12 రోజులు ప్రచారం చేసేవారు. అది నుంచి ఎన్నికల వ్యుహంలో ముందువరుసలో ఉండే టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు దూసుకుపోతుంది. ఈ గందరగోళ పరిస్థితులు అర్థం చేసుకోలేక ప్రతిపక్ష పార్టీలు వెనుకబడుతున్నాయని రాజకీయవేత్తలు భావిస్తున్నారు.