Warangal MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎంజీఎంలో ఎలుకల స్వైర విహారం (Rats attack on a patient ), రోగుల అవస్థలపై టీవీ9 వరుస కథనాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు పై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సూపరింటెండెంట్‌గా డాక్టర్ చంద్రశేఖర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు ఈ ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు వైద్యులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రశేఖర్ రావు గతంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించారు. కాగా.. ఎంజీఎం ఆసుపత్రి ఘటనపై వైద్యశాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది.
హన్మకొండ జిల్లాలోని భీమారానికి చెందిన శ్రీనివాస్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్య రావడంతో నాలుగురోజుల క్రితం కుటుంబసభ్యులు ఎంజీఎంలో చేర్చారు. శ్రీనివాస్ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో చేరిన తొలిరోజే రోగి శ్రీనివాస్ కుడి చేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో కట్టు కట్టి చికిత్స అందించారు. గురువారం ఉదయం కూడా ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడమ వద్ద ఎలుకలు కొరికడంతో తీవ్ర రక్తస్రావమైంది.
Also Read: