Ramappa : రామప్ప రుద్రేశ్వర ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేసింది. ఏళ్ల నిరీక్షణకు యునెస్కో ముగింపు పలికింది. సర్వాంగసుందరంగా ముస్తాబైన రామప్ప అంతర్జాతీయ పర్యాటక ముఖచిత్రంలో స్థానం సంపాదించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు కేటాయించి అంతర్జాతీయ స్థాయిలో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. వరల్డ్ హెరిటేజ్ కమిటీ (యునెస్కో ) భేటీ అయ్యి రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
రామప్ప వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కి.మీ. దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో ఉంది. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఆలయ సమీపంలో విశాలమైన చెరువు కూడా నిర్మించాడు. రామప్ప ఆలయ గర్భగుడిలో రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. కానీ ఆ రామలింగేశ్వరుడి పేరుతో ఈ ఆలయానికా పేరు రాలేదు. ఆనాటి పాలకుడైన గణపతిదేవుడి పేరుతోనూ పిలువలేదు.
ఇంత అందమైన ఆలయాన్ని కట్టించిన రేచర్ల రుద్రుడి పేరుతోనూ చెప్పుకోలేదు, తన శిల్పకళతో ఆ ఆలయం అణువణువునూ అపురూపంగా మలిచిన శిల్పాచార్యుడు, స్థపతి అయిన రామప్ప పేరుతో ప్రఖ్యాతిగాంచింది. కాకతీయుల పాలన శిల్ప కళకు స్వర్ణయుగం, అందులోనూ త్రికూటాలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే, రామప్ప గుడి త్రికూటాలయం కాదు. కానీ, ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు. ఉత్తర, దక్షిణ దిశల్లోనూ ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం మధ్యభాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు.
రామప్ప ఆలయ గోపురం తేలికైన ఇటుకలతో రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు ఏనుగు లద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు. ఈ పదార్థాలన్నీ సరైన మోతాదులో ఉపయోగించి గట్టిదనం ఉంటూనే, తేలికగా ఉండే ఇటుకలను రూపొందించారు. ఇవి నీటిలో తేలుతాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ ఇటుకల సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండటం వల్ల అవి నీటిలో తేలుతాయి. కాకతీయ శిల్పులకు మాత్రమే సొంతమైన పరిజ్ఞానమిది.