గూగుల్ రోడ్ మ్యాప్ ఓ వ్యాన్ ని ప్రాజెక్టు నీళ్లలోకి తీసుకెళ్లింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ దగ్గర గూగుల్ మ్యాప్ తప్పుదారి పట్టించి ప్రమాదంలో నెట్టివేసింది. గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టులో ఓ వ్యాన్ చిక్కుకోవడానికి కారణమైంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాల ప్యాకెట్ కవర్ లోడ్ తో హుస్నాబాద్ నుండి హైదరాబాద్‌కు వెళుతు డ్రైవర్ కు దారిపై సరైన అవగాహన లేకపోవడంతో స్మార్ట్ ఫోన్లో గూగుల్ రూట్ మ్యాప్ ఆధారంగా వ్యాన్ని నడిపారు. నందారం స్టేజి దాటిన తర్వాత సూటిగా రోడ్డు ఉందని గూగుల్ చూపగా, చీకట్లో వ్యాన్ని నడుపుతూ అలాగే వెళ్లారు. వానల వల్ల నిలిచిన నీరు అనుకుని ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది.
వ్యాన్ క్యాబిన్ వరకు నీళ్లు చేరి వాహనం పనిచేయడం ఆగిందని గ్రహించిన డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యాన్ దిగి మెల్లగా సమీపంలోని జలు బాయ్ తండాకు వెళ్ళారు. విషయం గ్రామస్తులకు తెలుపగా.. వ్యాన్ ప్రాజెక్టు నీటిలో మునిగిందని గ్రహించిన గ్రామస్తులు వ్యాన్‌కి తాళ్లు కట్టి జెసిబి సహాయంతో వెనుక్కులాగడంతో అతి కష్టం మీద బయటకు వచ్చింది. అయితే గత నాలుగు నెలల క్రితం ఓ లారీ కూడా గూగుల్ రూట్ మ్యాప్ తప్పుదారి పట్టియడంతో ఇదే రీతిగా ప్రాజెక్ట్ నీటిలోకి దూసుకెళ్లింది. అప్పుడు కూడా డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రాణాపాయం తప్పింది. అప్పుడు కూడా ఇదే గ్రామస్తులు జెసిబి సహాయంతో లారీని బయటికి తీశారు. వాస్తవానికి నందారం స్టేజ్ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాలను అక్కడి నుండి బైపాస్ రోడ్డు ద్వారా దారి మళ్ళించారు. అయితే స్టాపర్లు రోడ్డు పక్కన పడిపోయాయి, ఎవరు పట్టించుకోలేదు. దీంతో వ్యాన్ ఆ దారిలో వెళ్లి ప్రాజెక్టు నీటిలోకి దూసుకుపోయింది. ఇప్పటికైనా నందారం నుంచి ప్రాజెక్టు వైపుకు ఉన్న దారిని పూర్తిగా మూసివేయాలని గ్రామస్తులు, స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..