మునుగోడు ఉప ఎన్నికల గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతే కాకుండా వారి తరఫున పార్టీల ముఖ్య నేతలు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో సారి ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికలో ఈ పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఢిల్లీ నుంచి నిధులు తెస్తామని చెప్పిన రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు రఘునందన్, ఈటల రాజేందర్ లు వారి నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూర్‌నగర్, నాగార్జున సాగర్‌లో అభివృద్ధి జరగలేదని, అక్కడి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మునుగోడు నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి డెవలప్ మెంట్ జరగలేదని స్పష్టం చేశారు.
మునుగోడును గుంతల రోడ్ల మయంగా మార్చారు. బంగారు తెలంగాణలో మునుగోడు లేదా?.. దత్తత పేరుతో కేటీఆర్ లేనిపోనివి మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను సీఎం చేసింది రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయడానికి కాదా?. ఓటు అడగడానికి వచ్చి దౌర్జన్యం చేస్తారా?. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే టీఆర్ఎస్, బీజేపీలకు భయం ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తాయి. మునుగోడులో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం చాలా ఉంది.
– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
కాగా.. కేంద్రంలో బీజేపీపై టీఆర్ఎస్, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పై బీజేపీ విమర్శలకు దిగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకె.అరుణ వేర్వేరుగా మునుగోడు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక్క రాజగోపాల్ రెడ్డి మీద ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు దాడి చేస్తున్నారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇక్కడ అడ్డాపెట్టి ఓడించాలని చూస్తున్నారని, 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలను గ్రామ గ్రామానికి కేటాయించారన్నారు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో బాగా కొట్లాడుతున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అందుకే ఆయన గొంతు నొక్కాలని అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి