
పూరీలు అందరికీ ఇష్టమైన టిఫిన్. వేడి వేడిగా, బాగా పొంగిన పూరీలు తినడం మనందరికీ ఇష్టం. సాధారణంగా, పూరీలను వేడి నూనెలో వేయించి తయారు చేస్తారు. తదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఇడ్లీ, దోసలతో పాటు పూరీ కూడా ఫేమస్. అయితే, పూరీ ఉత్తర భారతదేశంలో కూడా ఒక మెయిన్ ఫుడ్. ఇక అసలు విషయానికి వస్తే.. గతంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిలాల్పూర్ అనే గ్రామంలో ఒక వినూత్నమైన వంట పద్ధతి వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న ఒక చిన్న హోటల్ దాని ప్రత్యేకత కారణంగా చాలా ఫేమస్ అయింది. ఈ హోటల్‌లో పూరీలను నూనెలో కాకుండా, విచిత్రంగా నీళ్లలో వేయించి తయారు చేస్తారు. ఇది వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ.. ఇది నిజం.
ఈ వింత పద్ధతి గురించి తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు. కస్టమర్ల రూపంలో హోటల్‌కు వెళ్లి, యజమానితో మాట్లాడి, ఆ నీటిని పరిశీలించారు. అవి నూనెలా కాకుండా తేలికగా నీరులా ఉండటంతో, పరిశీలించిన వారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ నమ్మశక్యం కాని విషయం ఒకరి ద్వారా మరొకరికి తెలియడంతో, ఆ హోటల్‌కు వినియోగదారుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఈ వినూత్న పద్ధతి ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలని ప్రయత్నించగా, హోటల్ యజమాని దానిని రహస్యంగా ఉంచాడు. “ఇది మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన రహస్యం. ఇది మా జీవనోపాధి. కాబట్టి మేము దీనిని ఎవరికీ చెప్పలేము,” అని యజమాని స్పష్టం చేశాడు. అయితే, వారు అందించే పూరీలు నూనెలో వేయించిన పూరీల మాదిరిగానే మెత్తగా, రుచిగా ఉంటాయని అతను హామీ ఇచ్చాడు. “ఎలా చేసినా, దానిలో ఏం ఉన్నా, మా దగ్గరికి వచ్చేవారికి రుచికరమైన, మెత్తని పూరీలు అందించడంలో మాకు సంతోషం ఉంటుంది,” అని యజమాని తెలిపాడు. గ్రామస్థులు కూడా హోటల్ యజమాని మాటలకు వంత పలుకుతూ, వారు తమ పూర్వీకుల నుండి ఈ పూరీల వ్యాపారాన్ని చేస్తున్నారని, ఆ రహస్యాన్ని వారు ఎవరికీ చెప్పరని పేర్కొన్నారు.
ఈ వింత పద్ధతి గురించి కొంతమంది ప్రొఫెసర్‌లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారి పరిశీలనల ప్రకారం, నీటి మాదిరిగా కనిపించే కొన్ని రకాల నూనెలు ఉండవచ్చని, వాటిలో బాగా మరిగించిన నీటిని కలిపినప్పుడు, ఆ నూనె తన గుణాన్ని కోల్పోయి నీరులా మారే అవకాశం ఉందని వారు సూచించారు. అయితే, ఇది అన్నిసార్లు జరిగే అవకాశం లేదని కూడా వారు స్పష్టం చేశారు. ఈ రహస్య పద్ధతి వెనుక ఉన్న వాస్తవం ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ, దిలాల్పూర్ హోటల్ తన ప్రత్యేకతతో వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంది.