గన్ పార్క్ వద్ద ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలకు నిరసనగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన ధర్నాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అంతకుముందు అసెంబ్లీలో సీఎం రేవంత్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. 2 అంశాలపై స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. విద్యుత్ మీటర్ల విషయంలో సభను తప్పుదోవ పట్టించారని.. మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. అనంతరం గన్‌పార్క్ దగ్గర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అమరుల స్థూపం ముందు నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ వ్యాన్‌లో తరలించారు.