Telangana: తెలంగాణ సచివాలయం ఓపెనింగ్ డేట్ ఫిక్స్.. ఫిబ్రవరి 17న కొత్త సెక్రటేరియట్ ప్రారంభం..

|

Jan 15, 2023 | 1:11 PM

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి డేట్‌ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సెక్రటేరియట్‌ను

Telangana: తెలంగాణ సచివాలయం ఓపెనింగ్ డేట్ ఫిక్స్.. ఫిబ్రవరి 17న కొత్త సెక్రటేరియట్ ప్రారంభం..
Telangana Secretariat
Follow us on

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి డేట్‌ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. రూ.617 కోట్లతో సచివాలయ భవనాన్ని గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో నిర్మించారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్‌ చేశారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ పేరుని ఖరారు చేశారు. సచివాలయం లోపలే టెంపుల్‌, మజీద్‌ కూడా నిర్మిస్తున్నారు.

కాగా, ఇప్పటికీ సచివాలయ నిర్మాణం ఇంకా పూర్తవలేదు. ఇంకా నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. దాంతో వీలైతే మొత్తం భవనం లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరోఅంతస్థు, సాధారణ పరిపాలనాశాఖ కోసం మరో అంతస్థు సిద్ధం చేసి ప్రారంభిస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, ప్రధాన ప్రవేశద్వారం, పోర్టికో వంటి పనులు జరుగుతున్నాయి. భవనంముందు విశాలంగా ఉండేలా పచ్చికబయళ్లు, ల్యాండ్‌స్కేపింగ్‌ పనులు సమాంతరంగా సాగుతున్నాయి.

మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు చేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తరచూ సచివాలయ పనులు పరిశీలిస్తూ పురోగతిని తెలుసుకోవడం సహా వేగవంతానికి ఆదేశాలిస్తున్నారు. వీలైనంత త్వరగా పనులన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఇవి కూడా చదవండి

తుదిదశకు అమరవీరుల స్మారకం..

సచివాలయం ఎదురుగా మరో ప్రతిష్టాత్మక నిర్మాణమైన తెలంగాణ అమరవీరుల స్మారకం పనులు తుదిదశలో ఉన్నాయి. స్మారకానికి చెందిన ఫినిషింగ్ పనులు సాగుతున్నాయి. స్టీల్ ప్యానెలింగ్ ఇప్పటికే పూర్తికాగా లోపలఫాల్‌సీలింగ్ పనులు జరుగుతున్నాయి. అమరులస్ఫూర్తి నిత్యం జ్వలించేలాస్మారకంపైన ఉన్న దీపానికి రంగుల పనులు సాగుతున్నాయి. నిత్యం వెలుగుతున్నట్లు అనిపించేలా రంగులు అద్దుతున్నారు. 20 ఏళ్ల పాటు రంగులు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం దుబాయ్ నుంచి అవసరమైన సామాగ్రి తీసుకొచ్చారు. స్మారకం ప్రాంగణంలో ల్యాండ్ స్కేపింగ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.

తెలంగాణ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం..

తెలంగాణ తల్లి విగ్రహం పనులు తుదిదశకు చేరుకున్నాయి. నెలాఖరు లోపు స్మారకాన్ని సిద్ధం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయం సమీపంలో రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ భారీ విగ్రహం ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 125 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు 50 అడుగుల మేర పనులు పూర్తయ్యాయి. విగ్రహం కింది నిర్మాణాలు పూర్తయ్యాయి. ఫ్లోరింగ్ సహా ఇతరపనులు సాగుతున్నాయి. మ్యూజియానికి చెందిన పనులతో పాటు ల్యాండ్ స్కేపింగ్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మార్చిలోపే అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..