Drone farming: సర్వాంతర్యామిగా మారిన డ్రోన్..! పురుగు మందు పిచికారితో వ్యవసాయంలో కొత్త ఒరవడి..

| Edited By: Jyothi Gadda

Sep 20, 2023 | 12:54 PM

డ్రోన్‌ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. విత్తనాలు చల్లుకోవడం నుంచి ఎరువులు, పురుగు మందులు వేయ­డం, పంటల అంచనా, పంటలకు అందించాల్సిన పోషకాలు అందించడంతో పా­టు పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోజనకారిగా మారింది. రానున్న రోజుల్లో చిన్నపాటి డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి జరుగుతోందని‌ స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Drone farming: సర్వాంతర్యామిగా మారిన డ్రోన్..! పురుగు మందు పిచికారితో వ్యవసాయంలో కొత్త ఒరవడి..
Drone Farming
Follow us on

డ్రోన్‌.. ఇందు గలదు అందులేదు అన్న సందేహం లేదు.. ఎందెందు వెతికినా అందదు కలదు. అవును ఇప్పుడు గాల్లో చక్కర్లు కొట్టేందుకు ఈడ ఆడ అన్న తేడా లేదంటూ దూసుకుపోతోంది. పెళ్లిళ్లకు మాత్రమే పరిమితం అయిన డ్రోన్లు.. నా రూటే సపరేట్ అంటూ.. బహిరంగ సభలు, నాయకుల పాదయాత్రలతో మరింత వేగం పెంచింది.. అక్కడితో ఆగిపోతే అది డ్రోన్ ఎందుకు అవుతుంది.. తాజాగా సరిహద్దులు దాటి సైనికుల రంగంలోకి దిగింది. జవాన్ కోసం మాత్రమే కాదు తాజాగా జై కిషాన్ అంటూ నినదిస్తోంది. పంటల సాగు కు తోడ్పడుతూ.. మందుల పిచికారికి నేనుసైతం అంటూ అన్నదాతకు అండగా నిలుస్తోంది డ్రోన్.

నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి (బి) గ్రామానికి చెందిన బాలాజీ అనే రైతు తన సోయా పంట కు డ్రోన్ ద్వారా పురుగుల మందు పిచికారి చేస్తూ భళా అనిపిస్తున్నాడు. వ్యవసాయ పనుల్లో ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు బాలాజీ. కూలీల కొరత, ఖర్చులు పెరగడంతో డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేస్తూ ఎకరానికి మూడు వేల చొప్పున ఆదా చేయగలుగుతున్నారు. డ్రోన్ ను వాడటం ద్వారా ఒక ఎకరానికి కేవలం 450 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంతేకాదు.. CRD రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా కొంత ఆర్థిక సహాయం కూడా అందుతుంది. దీంతో  ఆర్థిక కష్టాల నుండి అవలీలగా బయటపడ గలుగుతున్నానని చెప్తున్నాడు రైతు‌ బాలాజీ. డ్రోన్ ద్వారా మందులు పిచికారి చేయడంతో ఇటు సమయంతో పాటు అటు కూలీల ఖర్చు కూడా కలిసి వస్తుందని రైతు బాలాజీ చెబుతున్నాడు.

డ్రోన్ సాయంతో..

ఇవి కూడా చదవండి

మందుల పిచికారికి 5 గురు కూలీలు చేసే పనిని డ్రోన్‌ ఒక్కటే చేస్తుంది. టైం కూడా 60 శాతం ఆదా అవుతోందని.. నీరు, మందు ఖర్చును, సమయాన్ని తగ్గించవచ్చని బాలాజీ చెప్తున్నాడు. పొలంలో మొక్కలన్నింటికి సమానంగా మందును పిచికారి చేయవచ్చు. డ్రోన్‌కు అనుసంధానం చేసి స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పొలంలో కావాల్సిన చోట డ్రోన్‌ కెమెరాను తిప్పుతూ ఫొటోలు కూడా తీయవచ్చని చెప్తున్నాడు రైతు‌ బాలాజీ. మరోవైపు ఎరువుల్ని చల్లడం, వెద పద్ధతిలో విత్తనాలు వేయడానికి సైతం వినియో­గి­స్తు­న్నానని తెలిపాడు బాలాజీ.

మరో­వైపు డ్రోన్లను వినియోగించి నేల స్వభావం తెలు­సుకోవడం ద్వారా నేలలో ఏయే పోషకాలు అవస­రం, ఏ పోషకాలు అధికంగా ఉన్నాయి, ఉప్పు నేలలు, చౌడు, ఉరకెత్తు ప్రాంతాలను గుర్తించి వాటి­కి అనుగుణంగా యాజ­మాన్య పద్ధతులు చేపట్టేందుకు ఉపయోగ­పడుతున్నాయని చెప్తున్నాడు రైతు బాలాజీ. బాలాజీ ఐడియాతో స్థానికంగా ఉన్న రైతులు‌ సైతం సాగుకు‌సాయంగా డ్రోన్లను వాడేందుకు ముందుకొస్తున్నారు.

విప్లవాత్మక మార్పులకు శ్రీకారం..

డ్రోన్‌ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. విత్తనాలు చల్లుకోవడం నుంచి ఎరువులు, పురుగు మందులు వేయ­డం, పంటల అంచనా, పంటలకు అందించాల్సిన పోషకాలు అందించడంతో పా­టు పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోజనకారిగా మారింది. రానున్న రోజుల్లో చిన్నపాటి డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి జరుగుతోందని‌ స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

స్మార్ట్ వర్క్ నీట్ వర్క్.. సెల్ ఫోన్ కంటే ఇస్మార్ట్ గా

కూలీల కొరత తీవ్రమవటం, ఎరువులు, పురుగు మందు ధరలు పెరిగిపోవటం వల్ల నష్టపోతున్న రైతులకు ఈ డ్రోన్ ఊరట కల్పించడమే కాకుండా యువతరాన్ని రాబోయే కాలంలో వ్యవసాయం వైపు మరల్చడానికి ఈ టె­క్నాలజీ దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబు­తున్నారు. షేడ్‌నెట్స్, గ్రీన్‌మ్యాట్‌ వంటి పద్ధతుల్లో పంటలు పండించే చోట గాలి ఎక్కు­వగా తగలకపోవడం వల్ల పుప్పొడి ఒక పుష్పం నుంచి మరో పుష్పంపైకి చేరటం లేదు. ఈ కారణంగా మొక్కల్లో పరపరాగ సంపర్కం జర­గక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అరచేతిలో ఇమిడిపోయేంత డ్రోన్లను ఆ మొక్క­ల­పై తిప్పితే పరపరాగ సంపర్కం అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించినట్టు తెలుస్తోంది. చూడాలి రాబోయో డిజిటల్ మాయ ప్రపంచంలో డ్రోన్ లు ఇంకెంత దూకుడుతో దూసుకెళుతాయో.. ఇంకెన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతాయో.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..