టీ-కాంగ్రెస్‌లో కొత్త ట్రెండు.. తిరగబడితే తిరుగుబాటే! అర్థం మార్చుకున్న అంతర్గత ప్రజాస్వామ్యం!
రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేరు. వాటి రూటే సెపరేటు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కేబినెట్ విస్తరణ చెయ్యబోతే పార్టీలో వచ్చిన తిరుగుబాటు గుర్తుందా? చోటు దక్కని ఎమ్మెల్యేలు, పోర్ట్‌ఫోలియోల కేటాయింపులో వచ్చిన గొడవలు.. అన్నీ కలిసి అసంతృప్తులు రచ్చకెక్కి.. ఢిల్లీకి తాకింది సెగ. సీనియర్లు కొందరు ముఖ్యమంత్రిని బెదిరించినట్టు కూడా వార్తలొచ్చాయి. కానీ, మీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు నా దగ్గర చెల్లవు.. దమ్ముంటే రాజీనామా చెయ్యండి.. అర నిమిషంలోనే ఆమోదిస్తా.. అని రెబల్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు సీఎం డీకే. చివరాఖరికి ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న డీకే మార్క్ ఆఫ్ ట్రీట్‌మెంటే నెగ్గింది. ఎగిరెగిరి పడినవాళ్లంతా దారికొచ్చి తోక ముడిచి ఎవరి సీట్లలో వాళ్లు ఒద్దిగ్గా కూర్చున్నారు. డీకే ఫార్ములాతో కర్ణాటక కాంగ్రెస్ కరెక్ట్ లైన్‌లోకి వచ్చిందా లేదా అనేది అటుంచితే, ఒకప్పుడు కాంగ్రెస్‌ని బతికించిన రెబలిజం.. ఇప్పుడు అస్సలు వర్కవుట్ కాదనే మాటైతే నిజం. ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్‌లో పరిణామాలు కూడా ఆ ఇజాన్నే ఎస్టాబ్లిష్ చేస్తున్నాయా? గాంధీభవన్‌లో ఆ చప్పుళ్లను చల్లార్చడానికి పీసీసీ దగ్గర కొత్త మంత్రం ఏదైనా ఉందా? చూద్దాం..

‘నా కూతురి కామెంట్లు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలంటే, అది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అయినా, పార్టీ నాయకత్వంపై నాకు పూర్తి గౌరవం ఉంది, దయచేసి నోటీసును ఉపసంహరించుకోండి.. ఇట్లు మీ విధేయురాలు!’ కూతురు సుష్మిత చేసిన కామెంట్లపై మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణా కమిటీకి రాసిచ్చిన సంజాయిషీ సారాంశం ఇది. సుతిమెత్తగా వెన్న రాసినట్టే ఉంది తప్ప, ఒక ఫైర్‌బ్రాండ్ లీడర్ నుంచి వచ్చిన రియాక్షన్‌లా లేదు. ఎందుకంటే, ‘అయితే ఏంటి’ అనే స్టయిల్‌లో తిరగబడే వాయిస్ కొండా సురేఖది. ఒక్క ఓరుగల్లు జిల్లాలోనే కాదు, స్టేట్‌వైడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న కొండా ఫ్యామిలీ.. డిసిప్లినరీ కమిటీ ఎదుట చాలాసార్లు నిలబడాల్సి వచ్చింది. కానీ, ఇలా స్లో అండ్ స్టడీ నేచర్‌ని ఎప్పుడూ చూసింది లేదు. అందుకే, సుష్మిత ఎపిసోడ్‌లో కొండా నుంచి వచ్చిన రియాక్షన్‌పై పార్టీ లోపలా బైటా పెద్ద చర్చే జరుగుతోంది. మీరు మారిపోయారు సార్.. అని అదేదో సినిమాలో డైలాగుని గుర్తు చేసుకుంటున్నారు లీడర్లు. కొండా సురేఖ నిజంగానే మారిపోయారా లేక మారిపోవాల్సి వచ్చిందా? నాటోన్లీ కొండా కుటుంబం, తెలంగాణ కాంగ్రెస్ మొత్తమ్మీద ఏదో మార్పయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకు? రెబల్స్ విషయంలో గాంధీభవన్‌లో ఏదైనా కొత్త ఫార్ములా వర్కవుట్ చేస్తోందా? ఇది తిరుగుబాటుకే తిరుగుబాటు. అసమ్మతిపైకే పోటెత్తిన అసమ్మతి. అవును, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐనట్టు కొత్తరకం మేథమేటిక్స్...
