తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు పబ్లిక్ వార్ తోపాటు సోషల్ మీడియా వార్‌కు సైతం సై అంటున్నారు. ప్రచారం మొదలైనప్పటి నుండి ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్ మీడియా ప్రచారం కోసమే ప్రత్యేక టీములను నియమించుకున్నారు పార్టీ అభ్యర్థులు. బయటి ప్రచారం కంటే అన్‌లైన్ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్ ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు .
తెలంగాణలో ఇప్పుడు అంతా ఎలక్షన్ యాడ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఎన్నికల నగరా మోగినప్పటి నుండి అధికార పార్టీపై ప్రత్యర్ధులు, ప్రత్యర్థులపై అధికార పార్టీ విమర్శలు చేసుకుంటూ చేసిన ఎలక్షన్ యాడ్స్ ఇప్పుడు ట్రెండింగ్ మారాయి. ఏ సోషల్ మీడియా చూసిన తెలంగాణ ఎన్నికల ప్రచారమే కనిపిస్తుంది.. వినిపిస్తుంది. సాధారణంగా ఎన్నికలంటేనే పబ్లిక్ మీటింగ్‌ల్లో నేతలు చేసిన వాక్యాలు ఘాటు విమర్శలు వైరల్‌గా మారుతుండేవి. కానీ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో మాత్రం పార్టీలు చేయించుకున్న ఎలక్షన్ యాడ్స్ యమా స్పీడ్‌గా వైరల్ అయిపోయాయి. ఒక పార్టీని విమర్శిస్తూ, మరో పార్టీ చేయించిన యాడ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇదే సమయంలో తమ పార్టీని కించపరుస్తూ ప్రత్యర్థి పార్టీ చేయించిన యాడ్స్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు మరో పార్టీ అభ్యర్థులు.
అటు అధికార బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాల పేరుతో మొదట పాటను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అదే పాటను పారడి చేస్తూ మరో పాటను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ రిలీజ్ చేసిన పారడి పాటను సోషల్ మీడియాలో మీమ్స్, రిల్స్ రూపంలో వైరల్‌గా మారిపోయాయి. అయితే వీటిపై అటు పోలీసుల తోపాటు ఇటు ఎలక్షన్ కమిషన్ కు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కొన్ని యాడ్స్ పై ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించింది. దీంతో రూటు మార్చిన కాంగ్రెస్, మరో యాడ్‌ను క్రియేట్ చేయించింది. అందులోనూ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని కించపరుస్తూ యాడ్ చేయించారంటూ మళ్లీ ఫిర్యాదులు వెళ్లాయి.
ఇలా ఎలక్షన్ యాడ్ రీల్స్ విషయంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు. ఇక ఒక పార్టీ అయితే మరో అడుగు ముందుకు వేసి ఒక పార్టీ పాటకు ఎవ్వరైనా సెలెబ్రిటీలు డ్యాన్స్‌లు చేస్తే, మరో పార్టీ ఆ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను కామెంట్లతో నింపేస్తున్నారు. దీంతో మళ్లీ సదరు సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతాలో వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఇటీవల మంత్రి కేటీఆర్ గంగవ్వతో చికెన్ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దీంతో మిగతా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా లో విమర్శలు చేయటంతో గంగవ్వ స్పందించాల్సి వచ్చింది.
సాధారణంగా ఎలక్షన్ సీజన్ అంటేనే విమర్శలు ప్రతి విమర్శలు సహజంగా ఉంటాయి. కానీ ఈసారి ఎలక్షన్ అంతా 50 శాతం సోషల్ మీడియా ప్రచారంపైనే ఆధారపడింది. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ తన ఫేస్‌బుక్‌ను బీఆర్ఎస్ పార్టీ నేతలు హ్యాక్ చేశారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కావాలని కొందరు కేటీఆర్ అభిమానులు తన సోషల్ మీడియా పేజ్‌ను హ్యాక్ చేసి బీఆర్ఎస్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక మరో ఘటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మార్ఫ్ రీల్స్ తయారుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇక తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంలో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఒక మతాన్ని ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, పలువురు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇక మరో ఘటనలో స్వయంగా రాజాసింగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫోన్ నెంబర్లతో సహా రాజాసింగ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.. ఇలా ఎలక్షన్ సీజన్ లో ఈసారి సైబర్ క్రైమ్ పోలీసులకి అనేక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.
ఈసారి ఎన్నికల్లో సోషల్ మీడియాపై ప్రత్యేక ఫోటోస్ పెట్టాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే ఉద్యోగాలు లేక చాలామంది ఖాళీగా ఉన్నారు. అయితే వారందరికీ 30 రోజుల ఉద్యోగం పేరుతో రాజకీయ పార్టీలు రోజుకు 1500 రూపాయలు చొప్పున చెల్లించే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సోషల్ మీడియాలో అభ్యర్థి పేరుతో ఫ్యాన్ పేజీలు తెరిచి అందులో పోస్టులు పెట్టడంతో పాటు ప్రత్యర్థి ఇచ్చే కౌంటర్‌కు రీకౌంటర్ పోస్టులు క్రియేట్ చేయడం వీరి పని. ఇలా చేసేందుకు ఒక్కో పార్టీ ఒక్కో విధంగా పోస్టులు పెట్టించుకుంటున్నారు. వీరు డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుండి వీరి ఖర్చు మొత్తం ఆయా పార్టీలే భరిస్తున్నాయి. వీరికి కావాల్సిన లాప్‌టాప్‌లు సైతం నేతలే అందిస్తున్నారు. అందుకు కావాల్సిన ఇంటర్నెట్‌తోపాటు పెట్రోల్ ఖర్చులను సైతం వీరికి చెల్లిస్తున్నారు. ఎలక్షన్ టైంలో నేతల వీడియోలు వైరల్‌గా మారటానికి సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
అయితే సోషల్ మీడియా ప్రచారం గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాస్త ఎక్కువగానే ప్రభావం చూపుతుంది. పార్టీ ఎలక్షన్ థీమ్ సాంగ్ ను ఒక పార్టీ నమ్ముకుంటే , దానికి పేరడీని నమ్ముకుంది మరో పార్టీ. ఏది ఏమైనా సోషల్ మీడియాలో లీడర్లు మాత్రం ఫుల్ యాక్షన్ అయిపోయారు. నేరుగా చేయాలనుకున్న విమర్శ కూడా సోషల్ మీడియాలో నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…