సూర్యాపేటకు రైల్వే లైన్.. దశాబ్దాల నిరీక్షణకు తెరపడేనా? కీలక దశకు చేరిన ప్రాజెక్ట్
Suryapet Railway Line: డోర్నకల్–గద్వాల్ మధ్య ప్రతిపాదించిన 296 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గంతో సూర్యాపేటకు రైలు కనెక్టివిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తవగా, ప్రస్తుతం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మార్గంతో ప్రయాణికులు, పరిశ్రమలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం అందనుంది.

సూర్యాపేట ప్రజల ఎన్నో ఏళ్ల రైలు కల సాకారమయ్యే దిశగా మరో అడుగు పడింది. డోర్నకల్–గద్వాల్ మధ్య ప్రతిపాదించిన కొత్త రైల్వే మార్గం సూర్యాపేట మీదుగా వెళ్లేలా ప్రణాళిక రూపొందించడంతో జిల్లా కేంద్రానికి రైల్వే కనెక్టివిటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 296 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గానికి ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తికాగా.. ప్రస్తుతం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రతిపాదిత రైల్వే లైన్ డోర్నకల్ నుంచి ప్రారంభమై ఖమ్మం రూరల్, కూసుమంచి, పాలేరు, మోతె మీదుగా సూర్యాపేటకు చేరుతుంది. అక్కడి నుంచి నల్లగొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాల మీదుగా గద్వాల్ వరకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే దక్షిణ తెలంగాణలో రైల్వే సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ లభించే అవకాశం ఉంది.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. కొత్త మార్గం పూర్తయితే సూర్యాపేట నుంచి హైదరాబాద్, విజయవాడతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు రైలు ప్రయాణం సులభమయ్యే అవకాశం ఉంది.
ప్రయాణికుల రాకపోకలతో పాటు వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు ఈ మార్గం ఉపయోగపడనుంది. సిమెంట్, బొగ్గు తదితర సరుకుల రవాణా సులభమైతే పరిశ్రమలకు రవాణా భారం తగ్గే అవకాశం ఉంది. అయితే DPR పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఆర్థిక శాఖ తదితర సంస్థల అనుమతులు అవసరం. దీంతో నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.
