ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల సంరంభం ముగిసింది. సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీపీఐ అనుబంధ AITUC సత్తా చాటింది. అత్యధిక ఓట్లతో నక్షత్రం గుర్తుకు కార్మికులు పట్టం కట్టారు. INTUCపై దాదాపు 2 వేల ఓట్ల ఆధిక్యంతో AITUC గెలుపొందింది. దాంతో.. సింగరేణిలో గుర్తింపు సంఘంగా AITUC ఆవిర్భవించింది. సింగరేణిలో మొత్తం 11 ఏరియాలు ఉండగా.. 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్‌లోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో, రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో AITUC విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాలో, రామగుండం రీజియన్‌లోని రామగుండం-3లో INTUC గెలుపొందింది.
సింగరేణి ఎన్నికల్లో AITUC, INTUC హోరాహోరీగా తలపడ్డాయి. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం–1, 2లోAITUC స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అత్యధిక ఓట్లతో ఆయా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం దక్కించుకుంటూనే అత్యధిక ఓట్లను రాబట్టింది. ఒక్క శ్రీరాంపూర్‌లోనే 2,166 ఓట్ల ఆధిక్యం చేజిక్కించుకోవడం పోలింగ్‌లోనే టర్నిగ్ పాయింట్‌గా నిలిచింది. ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం కార్పొరేట్, రామగుండం–3, భూపాలపల్లిలో AITUCపై INTUC స్వల్ప ఆధిక్యంతో ప్రాతినిధ్యం నిలుపుకోగలిగింది. మరోవైపు.. 2012, 2017లో సత్తా చాటిన బీఆర్‌ఎస్ అనుబంధ TBGKS ఈసారి ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది.
సింగరేణి ఎన్నికల్లో ఉదయం నుంచే కార్మికులు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు దీరారు. దాంతో.. గంటగంటకూ పోలింగ్ శాతం పెరిగింది. సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో జరిగిన ఎన్నికల్లో 94.15 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 39,773 మంది ఓటర్లు ఉండగా.. 37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక.. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా.. ప్రస్తుత గుర్తింపు సంఘం TBGKS ప్రధాన నాయకత్వం ప్రచారానికి దూరంగా ఉండటంతో ద్వితీయశ్రేణి నాయకులు అంతంత మాత్రంగానే ప్రచారం చేపట్టారు. INTUC తరఫున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహించారు. AITUC, CITU, BMS, HMS సంఘాల నాయకులు తమకున్న క్యాడర్‌తో గనుల్లో పట్టు కోసం ప్రయత్నించారు. కొన్ని సంఘాలు గ్యారంటీల పేరుతో ప్రచారం నిర్వహించాయి. అయితే.. INTUC, AITUC మాత్రమే ఎన్నికల్లో సత్తా చాటాయి. మొత్తంగా.. సింగరేణి ఎన్నికల్లో AITUC గెలుపు బావుటా ఎగురవేసింది. సింగరేణి ఎన్నికల్లో గెలుపు పొందడంతో AITUC నాయకులు సంబరాలు చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి