Telangana Politics: తెలంగాణలో జోరుగా లాంగ్‌జంప్ సీజన్.. ఆపరేషన్ ఆకర్ష్ దాదాపుగా షురూ ఐనట్టేనా!

|

Jan 25, 2024 | 9:06 PM

తెలంగాణలో అసెంబ్లీ దంగల్ ముగిసింది. ఆ వేడి చల్లారక ముందే లాంగ్ జంపుల సీజన్ షురూ అయినట్టుంది. వస్తావా.. అంటూ కాంగ్రెస్ నుంచి కన్ను గీటడాలు మొదలయ్యాయో లేదో గానీ, ఎగిరిపోతే ఎంత బావుంటుంది అనే పాటకు కోరస్ ఇస్తూ కొన్ని శాల్తీలు సీన్‌లోకి వచ్చేశాయి. ముఫ్పై మంది మాతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అంటే, ఆల్రెడీ 12 మందిని బుజ్జగిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ నుంచి సిగ్నల్స్‌ వస్తున్నాయి.

Telangana Politics: తెలంగాణలో జోరుగా లాంగ్‌జంప్ సీజన్.. ఆపరేషన్ ఆకర్ష్ దాదాపుగా షురూ ఐనట్టేనా!
BRS MLAs Meets CM Revanth Reddy
Follow us on

తెలంగాణలో అసెంబ్లీ దంగల్ ముగిసింది. ఆ వేడి చల్లారక ముందే లాంగ్ జంపుల సీజన్ షురూ అయినట్టుంది. వస్తావా.. అంటూ కాంగ్రెస్ నుంచి కన్ను గీటడాలు మొదలయ్యాయో లేదో గానీ, ఎగిరిపోతే ఎంత బావుంటుంది అనే పాటకు కోరస్ ఇస్తూ కొన్ని శాల్తీలు సీన్‌లోకి వచ్చేశాయి. ముఫ్పై మంది మాతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అంటే, ఆల్రెడీ 12 మందిని బుజ్జగిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ నుంచి సిగ్నల్స్‌ వస్తున్నాయి. మరీ, ఆ నలుగురితో మొదలైన రచ్చ.. చివరాఖరికి ఏ మలుపు తిరుగుతుంది. లోక్‌సభ ఎన్నికల సీజన్‌లో ఆపరేషన్ ఆకర్ష్ ప్రభావం ఏ పార్టీ మీద ఎంతెంత ఉండబోతోంది..? అన్నదీ తెలంగాన రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రితో మాటామంతీ పేరుతో బైటికొచ్చిన ఆ నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గ్రూప్ ఫోటో తాలూకు రచ్చ ఇంకా చల్లారనే లేదు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసమే కలిశాం. ఇందులో రాజకీయం లేనేలేదు అని సొంత పార్టీ ఆఫీసులోనే మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు ఆ నలుగురు ఎమ్మెల్యేలు, అయినా ఆ నలుగురి ముఖచిత్రాలపై అనుమానపు నీడలు వీడనే లేదు.

ఇదిలావుంటే గులాబీ పార్టీని వంద అడుగుల లోతుకు బొంద పెడతాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ రీసౌండ్ ఇస్తుండగానే, ఇలా యాక్షన్ పార్ట్ మొదలవడం సహజంగానే తెలంగాణ రాజకీయాన్ని కెలికిపారేసింది. మిగతా పార్టీల్లో సంగతేమో గాని.. బీఆర్‌ఎస్‌లో మాత్రం పెను ప్రకంపనలే సృష్టించిన పరిణామం ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఫ్లవర్ బొకే ఇచ్చొచ్చిన ఆ నలుగురూ హార్డ్‌కోర్ గులాబీ సైనికులే. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. ఇద్దరూ బీఆర్‌ఎస్‌లో సీనియర్ నేతలు. పైగా కేసీఆర్‌కీ, కేటీఆర్‌కీ సన్నిహితులు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి ఇటీవలి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని మరీ టికెట్ కేటాయించారు. మరో ఎమ్మెల్యే మాణిక్ రావుకి కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి. వీటన్నిటికీ మించి.. హరీష్ రావుకు మంచి గ్రిప్ ఉన్న మెదక్ జిల్లా నుంచే నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్‌ను కలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని పార్టీ లోపలే చర్చ జరుగుతోంది.

పుకార్లు పుట్టించకండి.. మాకసలు పార్టీ మారే ఆలోచనే లేదు.. అంటూ మీడియాను కార్నర్ చేశారే తప్పా… కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. అందుకే ఆ నలుగురూ ఇచ్చిన సంజాయిషీ బీఆర్‌ఎస్‌ కేడర్‌ని సంతృప్తిపర్చలేదు. పైగా… ముఖ్యమంత్రితో భేటీ అయ్యాక ఈ నలుగురూ హరీష్‌ను గానీ, కేటీఆర్‌ను గానీ కలిసి విషయాన్ని వివరించలేదు. ముఖ్యమంత్రిని కలుస్తున్నట్లుగా అధిష్టానానికి ముందుగా సమాచారం కూడా ఇవ్వలేదట.

ప్రోటోకాల్‌లో వివక్ష, నియోజకవర్గాల అభివృద్ధి , సెక్యూరిటీ పెంపు ఇలా ముఖ్యమంత్రి దగ్గర తమ కోర్కెల చిట్టా విప్పామన్నది ఆ నలుగురు ఎమ్మెల్యేల మాట. నిజానికి, ఇవన్నీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ ఎదుర్కొంటున్న సమస్యలు. పార్టీ హైకమాండ్ పర్మిషన్ తీసుకుని అందరూ కలిసే వెళితే ఆ లెక్క వేరుగా ఉండేది. మరి.. ఈ నలుగురు మాత్రమే ఒక జట్టుగా ఏర్పడి, ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకోవడం.. సహజంగానే పార్టీకి ఎంతోకొంత నష్టం కలిగించక మానదు. ఇప్పటివరకూ హైకమాండ్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. కానీ.. లోలోపల వేడివేడి చర్చయితే జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల దంగల్‌కి కౌంట్‌డౌన్ మొదలైన సమయంలో ఇలా జరగడంతో డిఫెన్స్‌లో పడింది బీఆర్‌ఎస్ పార్టీ. ఇదే గ్యాప్‌లో కాంగ్రెస్ పార్టీ ఎఫెన్స్ గేమ్ మొదలుపెట్టేసింది.

నాలుగుతో మొదలైన లెక్క నాలుగు దగ్గరే ఆగబోదు. నలభైకి చేరినా ఆశ్చర్యం లేదు. అంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్ భ్రమల్లో నుంచి బైటపడి వాస్తవంలోకి రావాలి. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ ఉనికే ప్రశ్నార్థకం కాబోతోంది, బీజేపీతోనే మాకు పోటీ అని జోస్యం చెబుతున్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. మేం గనుక గేట్లు తెరిస్తే కారు పార్టీ ఖాళీ అవడం పక్కా అనేది మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకున్న ధీమా.

కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్న ఈ గేమ్‌ షోను తమకు అనుకూలంగా మార్చుకుని.. థర్డ్ అంపైరింగ్ షురూ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇది కేవలం టీజర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది అంటూ బీఆర్‌ఎస్‌పై ర్యాగింగ్ షురూ చేస్తున్నారు కమలనాథులు. హరీష్‌రావు ఇచ్చిన సిగ్నల్‌తోనే ఆ నలుగురూ రేవంత్‌ని కలిశారు. గులాబీ పార్టీలో గ్రూపు కొట్లాట మొదలైంది. ఇక మీకూ మాకూ అందరికీ వద్ద న్నకొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్.. బీ రెఢి అంటోంది తెలంగాణ బీజేపీ.

ఇక కేసీఆర్ కూతురు కవిత మెదక్ ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారని, అది సుతరామూ ఇష్టం లేని హరీష్‌రావు ఈవిధంగా తన జిల్లా ఎమ్మెల్యేలతో కౌంటర్‌ గేమ్ మొదలు పెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని హరీష్‌రావే నేరుగా కలవడాన్ని గుర్తు చేస్తున్నారు. అటు, తమ జిల్లాలో జరిగిన ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. దీన్ని భూతద్దంలో చూడొద్దని బీజేపీకి క్లాస్ తీసుకున్నారాయన. గతంలో దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్ని కలవడం ఒప్పయినప్పుడు ఇది తప్పెలా అవుతుంది అనేది జగ్గారెడ్డి లాజిక్.

జస్ట్ వెయిట్ అండ్ సీ.. అని కొందరు కాంగ్రెస్ నేతలు ఆచితూచి స్పందిస్తే, మరికొందరు మాత్రం అగ్రెసివ్ మోడ్‌లో దూసుకెళ్తున్నారు. మొత్తం 30 మంది మాతో టచ్‌లో ఉన్నారు. చిటికేస్తే చాలు లోక్‌సభ ఎన్నికల ముందే హస్తం గూటికి చేరిపోతారు. అంటూ హాట్ స్టేట్‌మెంట్స్‌తో బీఆర్‌ఎస్‌లో హీట్ పుట్టిస్తున్నారు కాంగ్రెస్ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

గ్రూప్ ఫోటోలో ఉన్న ఆ నలుగురి చూపు ఎటువైపు అనేది దాదాపుగా కన్‌ఫమ్ అయిపోయింది. మరి.. యెన్నం చెప్పినట్టు ఆ 30 మంది లెక్కేంటి? బీఆర్‌ఎస్ టోటల్‌ స్కోరే 39. అందులో 30 మైనస్ అయితే.. పరిస్థితి ఏంటి? అంటూ చర్చ చాలాచాలా దూరం వెళుతోంది. కానీ.. అదంతా ఊహాతీతం. కేడర్ పరంగా సాలిడ్ బేస్ ఉన్న బీఆర్‌ఎస్ భూస్థాపితం కావడం అనేది కల్ల.. అనేది విశ్లేషకుల మాట. కానీ.. క్లిష్ట పరిస్థితుల్ని పసిగట్టి గులాబీ శిబిరం అప్రమత్తమైన మాటైతే నిజం. గోడదూకే ఛాన్స్ ఉన్న 12 మంది సొంత ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేసి.. వాళ్ల మీద స్పెషల్‌గా నజర్ పెట్టి.. బుజ్జగింపుల పర్వం కూడా షురూ చేసిందట బీఆర్‌ఎస్ హైకమాండ్.

ప్రభుత్వాలు మారగానే.. ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు మారడం సహజం. ప్రతిపక్షంలో కూర్చోడానికి ఇబ్బంది పడే ఎమ్మెల్యేలు అధికారపక్షం వైపు ఓరకంట చూడ్డం.. అటువంటి వన్‌సైడ్ లవ్వులు టూసైడ్ లవ్వులుగా మారి, కండువాలు మార్చుకోవడం కూడా కామన్. గతంలో కాంగ్రెస్ నుంచి డజన్ల కొద్దీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పంచన చేరినప్పటి భారీసైజు ఎగ్జాంపుల్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కాబోతోందా..? లేక.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రేవంత్‌రెడ్డిలాగే ఇక్కడ కూడా కేవలం అభివృద్ధే ప్రాతిపదికలు కలయికలు జరిగినట్టు భావించాలా? జంప్ జిలానీల సీజన్ టీ కప్పులో తుపానులా చప్పున చల్లారబోతోందా? షరామామూలుగానే ఒక పార్టీ కింద మరొక పార్టీ గుంతలు తీసి.. ఎత్తుకు పైఎత్తులు వేస్తారా? ఇలా డౌట్లతో రాబోయే రోజుల్లో యమా రంజుగా మారబోతున్నాయి తెలంగాణ రాజకీయాలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…