
చిన్న నీటి గుంటలో ఏం ఉంటుంది? కొన్ని చేపలు, నీటి పురుగులు.. అంతే అనుకుంటాం. కానీ అడవుల్లోని ఇలాంటి చిన్న చిన్న నీటి ఆవాసాల్లో కూడా ఇంతవరకు మనకు తెలియని ఎన్నో జీవజాతులు దాగి ఉండొచ్చు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అడవుల్లో శాస్త్రవేత్తలు గుర్తించిన ఓ కొత్త కీటక జాతి ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. ఈ కీటకం పేరు ‘ఎనిథారెస్ డెక్కనెన్సిస్’. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది నీటిలో మామూలుగా ఈదదు. తలకిందులుగా ఈదుతుంది. అందుకే ఈ కీటకాలు ఉండే కుటుంబాన్ని సాధారణంగా ‘బ్యాక్స్విమ్మర్స్’ అని పిలుస్తారు. ఇవి మంచినీటిలో జీవిస్తూ, ఇతర చిన్న జీవులను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. ఈ కొత్త జాతిని ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పరిశోధకులు గుర్తించారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాలు మరో అరుదైన జీవికి ఆవాసంగా ఉన్నాయన్నమాట.
అయితే ఇది కొత్త జాతి అని శాస్త్రవేత్తలు ఎలా నిర్ధారించారు? కేవలం చూడగానే గుర్తించలేదు. దాని శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. జన్యు లక్షణాలను కూడా విశ్లేషించారు. ఈ కీటకం రెక్కలపై ముదురు రంగులో కనిపించే ‘V’ ఆకారపు గుర్తు దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు. మగ కీటకాల్లో ఉండే కొడవలి ఆకారపు పునరుత్పత్తి నిర్మాణం కూడా ఇతర జాతుల నుంచి దీన్ని వేరు చేయడంలో ఉపయోగపడింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ జాతికి చెందిన కొన్ని నమూనాల్లో రంగుల తేడాలు కూడా కనిపించాయి. కొన్నింటిలో లేత రంగులు ఉంటే, మరికొన్నింటిలో ముదురు రంగులు ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించడంతో పాటు డీఎన్ఏ బార్‌కోడింగ్, జన్యు విశ్లేషణ, ఫైలోజెనెటిక్ అధ్యయనాలు నిర్వహించారు. ఇతర దగ్గరి జాతులతో పోల్చినప్పుడు దీని జన్యు నిర్మాణంలో 10 నుంచి 14.5 శాతం వరకు తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇది ఇప్పటివరకు శాస్త్రీయంగా గుర్తించని కొత్త జాతి అని నిర్ధారించారు.
ఈ పరిశోధనలో సోమేశ్ బెనర్జీ, దేవదాస్ కుమార్, డాక్టర్ దీపా జైస్వాల్, కరుతపాండి మదసామి పాల్గొన్నారు. వీరిలో కొందరు హైదరాబాద్‌లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు, మరికొందరు తమిళనాడులోని విరుదునగర్ వీహెచ్ఎన్ఎస్ఎన్ కళాశాలకు చెందినవారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు అంతర్జాతీయ పరిశోధనా పత్రిక ‘జర్నల్ ఆఫ్ నేచురల్ హిస్టరీ’లో ప్రచురితమయ్యాయి. ఈ ఆవిష్కరణలో అసలు ఆసక్తికరమైన విషయం మరోటి ఉంది. కొత్త జాతి కనిపించింది కదా అని మాత్రమే ఈ పరిశోధన ప్రాధాన్యం సంతరించుకోలేదు. అడవుల్లోని చిన్న నీటి ఆవాసాలు ఎంత ముఖ్యమైనవో కూడా ఇది తెలియజేస్తోంది. పెద్ద నదులు, సరస్సులే కాదు.. రాళ్ల మధ్య ఏర్పడే చిన్న నీటి గుంటలు, అడవి వాగులు, జలపాతాల దగ్గర ఉండే నీటి కొలనులు కూడా ఎన్నో జీవులకు నివాసాలుగా ఉంటాయి. ఇప్పటివరకు మనకు తెలియని జీవులు ఇలాంటి ప్రాంతాల్లో ఇంకా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో మరిన్ని సర్వేలు, పరిశోధనలు జరగాలని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ధృతి బెనర్జీ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ మంచినీటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తుచేశారు.
మొత్తానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అడవుల్లో బయటపడిన ఈ చిన్న కీటకం మనకు ఒక పెద్ద విషయాన్ని చెబుతోంది. ప్రకృతిలో మన కంటికి కనిపించేది మాత్రమే జీవవైవిధ్యం కాదు. మనం పట్టించుకోని చిన్న నీటి గుంటల్లోనూ, అడవుల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ ఎన్నో అద్భుతమైన జీవులు ఉండొచ్చు. వాటిని గుర్తించడం ఎంత ముఖ్యమో, అవి బతికే ఆవాసాలను కాపాడటం కూడా అంతే ముఖ్యం.