కరువు కాటకాలతో అల్లాడుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా పైరు పచ్చలతో సింగారించేందుకు సాగునీటి ప్రాజెక్టు అవసరమని ఆనాటి పాలకులు భావించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆలోచన మొదలైంది. సముద్ర మట్టానికి 546 అడుగుల ఎత్తులో ఆనకట్ట నిర్మించి నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీటిని అందించాలని భావించారు. నల్లగొండ జిల్లా నందికొండ వద్ద కృష్ణానదిపై ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి పాలకులు నడుం బిగించారు. ఇంతటి అపురూపమైన ఈ ప్రాజెక్టుకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జునసాగర్ వద్ద శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి రోజుకు 45 వేల మంది 12 ఏళ్ల పాటు శ్రమించారు. మొత్తం 19 కోట్ల 71 లక్షల మంది ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకుని ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మితమైన కట్టడాన్ని ఆవిష్కరించారు. దీన్ని 1967లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కాలువలకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా, ఆయన తనయ ఇందిరాగాంధీ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయడం విశేషం. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 98 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయింది. ఇప్పుడైతే వేలకోట్ల రూపాయలు వెచ్చించిన సాధ్యం కాని పని.
ప్రాజెక్టు ప్రత్యేకతలు…
ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడంగా ఉన్న ఈ ప్రాజెక్టు 110 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన జలాశయం ఉంది. గరిష్ట నీటి సాయి మట్టం 590 అడుగులతో 408 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 168 టీఎంసీల డెడ్ స్టోరేజి ఉంటుంది. మొత్తం ఆనకట్ట 5 కిలోమీటర్ల పొడవు కాగా, ప్రధాన డ్యాం 1.7 కిలోమీటర్లు, కుడి ఎర్త్ డ్యాం 1.8 కిలోమీటర్లు, ఎడమ ఎర్త్ డ్యాం 2.5 కిలోమీటర్లు ఉంది. 26 క్రస్ట్ గేట్లతో అద్భుతంగా నిర్మించారు. ప్రపంచంలోనే అత్యధిక డిశ్చార్జి సామర్ధ్యం కలిగిన కాలువగా కుడి కెనాల్ కు పేరుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కట్టిన ఈ ప్రాజెక్టు దేశంలోని ప్రాజెక్టులకు తల్లి లాంటిది. ఆధునిక దేవాలయంగా కీర్తించబడుతున్న మానవ నిర్మిత అతి పెద్ద రాతికట్టడం కావడంతో ఈ ప్రాజెక్ట్ చరిత్ర పుటల్లో నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఐదు జిల్లాల్లో కుడి, ఎడమ కాలువల ద్వారా 22 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా కాకుండా విద్యుత్ వెలుగులను కూడా అందిస్తోందని అధికారులు చెబుతున్నారు.
కుడి (జవహర్ కెనాల్) కాలువ..
సాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ (జవహర్ కెనాల్)ను నిర్మించారు. దీని పొడవు పూర్తి నిర్మాణ దశలో 245మైళ్లు. ఈ కాల్వ 21,000 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో 20లక్షల 62వేల ఎకరాల భూమికి సేద్యపు నీరు సరఫరా చేయగల శక్తి కలిగి ఉంది.1967ఆగస్టు 4వ తేదీన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఈ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. దీనికి ప్రథమ ప్రధాని జ్ఞాపకార్థం జవహర్ కెనాల్ అని నామకరణం చేశారు.
ఎడమ (లాల్ బహుదూర్ కెనాల్)కాలువ..
సాగర్ ఎడమ కాల్వకు జై జవాన్ – జై కిసాన్ అని పిలుపునిచ్చిన మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహుదూర్ శాస్త్రి జ్ఞాపకార్థం… లాల్ బహుదూర్ కెనాల్ అని నామకరణం చేశారు. కాల్వ నిడివి తుది దశలో 218మైళ్లు. ఈ కాల్వ సొరంగం నిర్మాణానికి 1959లో అప్పటి రాష్ట్ర గవర్నర్ భీమసేన సచార్ శంకుస్థాపన చేశారు. దీనిని కూడా 1967 ఆగస్టు 4వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నీటిని విడుదల చేసి ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన దేవాలయం…
ఆనాడు కుడి, ఎడమ కాలవల ద్వారా నీళ్లు రావడాన్ని చూసిన రైతులు ఆనందంతో తన్మయత్వం చెందారు. అప్పటి నుంచిy బీళ్లుగా ఉన్న భూముల్లో తెలుగు రాష్ట్రాల్లో రైతులు సిరులు పండించు కుంటున్నారు. నాడు కటిక దరిద్రాన్ని అనుభవించిన రైతులు నేడు ఆర్థికంగా బలపడ్డారు. తాగు, సాగు నీటికి కొదవలేకుండా పోయింది. ఈ ప్రాజెక్టును ఆయకట్టు రైతులు దేవాలయంగా భావిస్తుంటారు. ఈ ప్రాజెక్టు వల్లే అన్నం మెతుకులు తింటూ దేశానికి అన్నం పెడుతున్నామని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పది కాలాలపాటు దేశానికి అండగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన నాటి నుంచి ఎక్కువ సంవత్సరాల్లో ఆయకట్టుకు ఆగస్టులోనే నీటిని విడుదల చేశారు. ఈసారి కూడా ఎగవ కృష్ణ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ఈ ఏడాది కూడా ఆగస్టులోనే సాగునీటి విడుదల చేశారు. దీంతో మరోసారి సిరులు పండించుకోవాలని ఆయకట్టు రైతాంగం ఆశపడుతున్నారు.
నవ దేవాలయంలో పనిచేయడం అదృష్టం..
తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పని చేసే అవకాశం అందరికీ దక్కదని, ఈ నవ దేవాలయంలో పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితంగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అధికారిగా పని చేయడం తమ అదృష్టమని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు వేలాది గ్రామాలకు తాగనీరు అందిస్తున్న అద్భుతమైన మహా కట్టడమని అధికారులు చెబుతున్నారు.
ఆయకట్టుకు సాగునీటి విడుదల…
ప్రస్తుతం ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రెండు సీజన్లలో రైతులు పంటలకు దూరమయ్యారు. కుడి, ఎడమ కాలువలకు ఒక సీజన్ లో సాగునీరు ఇవ్వాలంటే 264 టీఎంసీల నీరు అవసరం. సాధారణంగా 570 అడుగులకు సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం చేరుకున్న సమయాల్లోనే ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయిలో నిండుతుండడంతో ఎడమ కాలువ ఆయకట్టుకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు సాగునీటిని విడుదల చేశారు.
ప్రాజెక్టు నెరవేరని లక్ష్యం.. స్థిరీకరణకు నోచుకోని ఆయకట్టు..
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యంగా నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 57 ఏళ్లు పూర్తయినా నేటికీ లక్ష్యానికి దూరంగానే ఉంది. సిమెంట్ తో నిర్మించిన కాలువలు కాలక్రమేణా దెబ్బతినడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ప్రపంచ బ్యాంకు రుణంతో చిట్టచివరి ఎకరం వరకు నీరందాలనే ఉద్దేశంతో సాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడంతో అనేకచోట్ల గండ్లు పడుతున్నాయని, చివరి భూములకు నీరందని కాల్వలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయకట్టును స్థిరీకరించి కాలువలకు మరమ్మత్తు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
దేశానికి సౌభాగ్యమైన నాగార్జునసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు.. నల్లగొండ జిల్లాకు శిఖరమై… రాష్ట్ర ప్రతిష్టకు మణిహారమై… చరిత్ర పుటల్లో నిలుస్తోంది. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రథమ చిహ్నమైన ఈ ప్రాజెక్టును ఆయకట్టు రైతులు అపురూపమైన దేవాలయంగా భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..