ఏ వాహనాన్ని ఆపినా అదే వాసన గుప్పుమంటుంది. ఏ ప్రాంతాంలో తనిఖీలు చేసినా.. అదే మాల్ తారసపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా మళ్లీ జోరందుకుంది. ఎన్నికల వేళ విసృత తనిఖీల నేపథ్యంలో గమ్మునుండిపోయిన పెడ్లర్లు మరోసారి.. దందాలు షురూ చేశారు. తాజాగా అక్రమంగా పెద్ద మొత్తంలో తరలిస్తున్న గంజాయిని కొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పట్టణంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద ఎస్సై విజయ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారులోని వ్యక్తులు తత్తరపడుతూ కనిపంచారు. దీంతో డౌట్ వచ్చి కారును తనిఖీ చేయగా 93 ప్యాకెట్లలో 186 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ. 75లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఒరిస్సాలోని మల్కాన్‌గిరి ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. నిందితులు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన భూక్యా లక్ష్మణ్, పెనుగొండ నరసింహులు, కుంచం లక్ష్మణ్‌గా గుర్తించారు. తనిఖీల్లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, వన్‌టౌన్ పోలీసులను ఎస్పీ బి. రోహిత్ రాజు అభినందించారు. గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఇదే జోష్‌తో ముందుకు సాగాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.