Telangana: ప్రేమించి పెళ్లాడాడు.. కట్ చేస్తే.. వన్ ఫైన్ డే ఆటో ఎక్కుతుండగా భార్యను..

అనుమానం పెనుభూతమైంది. ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే బలి తీసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో అందరూ చూస్తుండగానే ఓ భర్త తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. గొడవల నేపథ్యంలో పోలీసు స్టేషన్‌కు వచ్చి వెళ్తుండగా జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Telangana: ప్రేమించి పెళ్లాడాడు.. కట్ చేస్తే.. వన్ ఫైన్ డే ఆటో ఎక్కుతుండగా భార్యను..
Telugu News

Edited By:

Updated on: May 07, 2026 | 8:04 AM

భార్యాభర్తల బంధంలో ఉండాల్సిన నమ్మకం చోట అనుమానం చేరితే ఆ కాపురంలో చిచ్చు రేగుతుందని చెప్పడానికి కోదాడలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. అనుమానంతో ఒక భర్త విచక్షణ కోల్పోయి, రెండేళ్ల కొడుకు ఉన్నాడన్న జాలి కూడా లేకుండా కట్టుకున్న భార్యకు మరణ శాసనం రాశాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అందరూ చూస్తుండగానే ఈ ఘోర హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు చెందిన మణిదీప్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన శిరీషతో ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

అయితే కొంతకాలంగా భార్యపై మణిదీప్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్త వేధింపులు భరించలేక శిరీష గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పెద్దమనుషులు నచ్చజెప్పినా మణిదీప్ ప్రవర్తనలో మార్పు రాలేదు. తాజాగా రెండు రోజుల క్రితం మళ్ళీ గొడవ జరగడంతో శిరీష తన కొడుకును తీసుకుని హైదరాబాద్‌లోని అక్క ఇంటికి వెళ్లిపోయింది. అయితే, తన భార్య ఇంట్లో ఉన్న రూ. 40,000 తీసుకుని వెళ్లిపోయిందని మణిదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు శిరీష తన కొడుకు, పెద్దమ్మతో కలిసి కోదాడ స్టేషన్‌కు వచ్చింది. రాత్రి కావడంతో రేపు రావాలని పోలీసులు చెప్పి పంపించేశారు.

స్టేషన్ నుంచి బయటకు వచ్చి జగ్గయ్యపేట వెళ్లేందుకు ఆటో ఎక్కుతున్న శిరీషను మణిదీప్ గమనించాడు. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. భయంతో ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కనే ఉన్న టీ స్టాల్‌లోకి పరిగెత్తినా వదలకుండా వెంటాడి విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శిరీష అందరి కళ్ల ముందే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మణిదీప్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us