‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’.. ఒక పెద్ద వ్యవస్థలో ఒక ప్రాంతంలో జరిగే చిన్న మార్పు పెద్ద ప్రభావాన్ని చూపినప్పుడు ఈ పదాన్ని ప్రయోగిస్తుంటారు. అంటే ఒక చిన్న సీతాకోకచిలుక ఒక చోట రెక్కలు ఊపడం వల్ల కలిగే గాలి కదలిక మరెక్కడో టోర్నడో వంటి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని దీనర్థం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో దీని గురించి వివరించారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని విద్యార్థి దశలోనే మొదలుపెట్టి జెడ్పీటీసీ ద్వారా ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టి నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరిన రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో కూడా ఇలాంటి ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’లు ఉన్నాయి. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయనకు ఓ ముగ్గురు వ్యక్తులు చేసిన చిరు ప్రయత్నాలు పెను ప్రభావాన్ని చూపాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక.. ఈ మూడు రాష్ట్రాలకు చెందిన ఆ ముగ్గురు నేతలు మాణిక్కం టాగోర్, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్. ఈ ముగ్గురికీ… రేవంత్ రెడ్డికి.. బటర్ ఫ్లై ఎఫెక్ట్‌కి సంబంధం ఏంటో చూద్దాం..
తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం టాగోర్‌కు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించిన తర్వాతనే రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేతులు మారాయి. కొత్త పీసీసీ అధ్యక్షుణ్ణి ఎంపిక చేసే క్రమంలో మాణిక్కం టాగోర్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గలేదు. అన్ని జిల్లాల ముఖ్యనేతలతో ఆయన విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే క్రేజ్ కల్గిన నేతగా ఉన్న రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కోసం రేసులో ఉన్నారన్న విషయం తెలిసిన తర్వాత సీనియర్లలో అసంతృప్తి, అసమ్మతి సెగలు రగిలాయి, కానీ కార్యకర్తల్లో మాత్రం జోష్ పెరిగింది. ఇది స్వయానా గమనించిన మాణిక్కం టాగోర్.. పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ఏ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రేవంత్ పేరును అధిష్టానానికి సిఫార్సు చేశారు. ఒక దశలో టాగోర్‌పై సీనియర్ నేతలు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ దుర్భాషలాడారు. అయినా సరే.. టాగోర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫలితంగా పీసీసీ సారథ్య బాధ్యతలు రేవంత్ రెడ్డికి దక్కాయి.
కేరళకు చెందిన కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడంలో మాణిక్కం టాగోర్ పాత్ర ఎంత ఉందో.. ఆ తర్వాత అధిష్టానం నుంచి మద్దతు ఇవ్వడంలో కేసీ వేణుగోపాల్ పాత్ర కూడా అంతే ఉంది. రేవంత్ సారథ్యంలో దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరిగాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. అన్నింటిలోనూ కాంగ్రెస్ విఫలమైంది. దీన్ని సాకుగా చూపిస్తూ సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. రేవంత్‌ను తొలగించాలని డిమాండ్ చేసిన నేతలు సైతం లేకపోలేదు. కానీ అధిష్టానం వేటినీ పట్టించుకోకుండా.. రేవంత్‌పై ఉంచిన నమ్మకాన్ని కొనసాగించింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, ఆ తర్వాత జరిగిన సభలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన తీరు.. చివరగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేలా చేసి అధిష్టానం పెద్దలను రేవంత్ ఆకట్టుకున్నారు. వీటన్నింటి వెనుక కేసీ వేణుగోపాల్ సహకారం రేవంత్‌కు ఇతోధికంగా లభించింది. చివరగా ఆయన నోటి నుంచే తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా రేవంత్ అంటూ ప్రకటించారు.
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చిన డీకే శివకుమార్, పొరుగు రాష్ట్రం తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మొదటి నుంచి సన్నిహితంగా ఉన్నారు. ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ వచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన ఆర్థిక వనరులను కూడా డీకే శివకుమార్ ఏర్పాటు చేసినట్టు కథనాలున్నాయి. కర్ణాటక నుంచి తెలంగాణకు తరలిస్తున్న డబ్బులను అధికారులు పట్టుకున్నప్పుడు అవి కాంగ్రెస్ నేతల కోసం పంపినవేనంటూ వార్తలొచ్చాయి. వీటి సంగతెలా ఉన్నా.. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో గెలుపొందిన కాంగ్రెస్ నేతలను సంప్రదించి, సీఎల్పీ నేతను ఎంపిక చేసేక్రమంలో ఏఐసీసీ డీకే శివకుమార్‌కు కీలక బాధ్యత అప్పగించింది. ఏఐసీసీ పంపించిన పరిశీలకుల్లో డీకే శివకుమార్ ముఖ్య పాత్ర పోషించారు. ఎమ్మెల్యేల మనోగతం తెలుసుకున్నారు. సీనియర్ల అభ్యంతరాలను కూడా విన్నారు. అన్నీ కలిపి నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను అధిష్టానం పెద్దలకు సమర్పించారు. దాన్ని ఆధారంగా చేసుకున్న అధిష్టానం రేవంత్ రెడ్డినే సీఎల్పీ నేతగా ప్రకటించింది. తద్వారా ఆయన్ను తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా చేసింది.
ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సోపానాలు అధిరోహించడంలో తమిళనాడు (మాణిక్కం టాగోర్), కేరళ (కేసీ వేణుగోపాల్), కర్ణాటక (డీకే శివకుమార్) తలా కొంత పాత్ర పోషించారు. ఈ మూడు రాష్ట్రాలు దక్షిణాదివే కావడం గమనార్హం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…