తెలంగాణ కాంగ్రెస్‌లో మహిళా ఫైర్‌బ్రాండ్‌గా ప్రత్యేక ముద్ర వేసుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇప్పుడు ఆ పార్టీకి సెంటిమెంట్‌గా మారారు. ఆదివాసీ కోయ జాతికి చెందిన దంసారి అనసూయ అలియాస్ సీతక్క అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరంటే అశయోక్తి కాదు. ఆమె జీవితం ఖచ్చితంగా ఎందరికో ఆదర్శం. విద్యార్ధి దశ నుండే పోరాట జీవితం మొదలు పెట్టిన అనసూయ నక్సల్‌బరి ఉద్యమంలో చేరి మావోయిస్టులతో కలిసి ప్రభుత్వంపైనే పోరాటం చేశారు. ఇక అక్కడ మారిన సిద్ధాంతాలు పొసగక జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే, అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు సీతక్క.
ప్రజా సేవ పట్ల మక్కువతో గిరిజన మహిళలకు ఉపాధినిచ్చే ప్రభుత్వ సంస్థలో చేరారు. ఉద్యోగం చేసుకుంటూనే సామజిక సేవ వైపు ఆకర్షితులయ్యారు. జనంలో వచ్చిన మంచి పేరుతో రాజకీయాలలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఏకంగా గిరిజన బడ్డగా ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి పక్షాన నిలిచారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ నిజమైన ప్రజాసేవకురాలిగా ఎదిగిపోయారు. ఇలా నక్సలైట్ జీవితం నుండి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేసు దాకా అంచెలంచెలుగా సాగిన ఆమె ప్రస్థానం అందరికీ ఆదర్శమే..!
ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెంకి చెందిన సమ్మక్క, సమ్మయ్యలకు కూతరే దంసారి అనసూయ. ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో ఉంటూ చదువును కొనసాగించారు. విద్యార్థిని దశ నుంచి పోరాటాలకు శ్రీకారం చుట్టిన దిట్ట. హాస్టల్‌లో సరిగా భోజనం పెట్టడం లేదని, బాలికలకు ప్రభుత్వం ఇచ్చే పది రూపాయలను అందడంలేదని అధికారులనే నిలదీశారు. తోటి విద్యార్థులను కూడగట్టుకుని ఏకంగా ధర్నా చేశారు. ఆలా 13 ఏళ్ల వయసులోనే 1986లో పోరాట జీవితంలోకి అడుగుపెట్టింది సీతక్క.
విద్యార్థిగా ఉన్న సమయంలోనే పీపుల్స్ వార్ దళం సభ్యుల కంట్లో పడింది అనసూయ. అదే సమయంలో నక్సలైట్‌గా ఉన్న తన సోదరుడు సాంబయ్య పోలీసుల చేతిలో మరణించాడు. బావ శ్రీరాముడు దళంలో ఉండటంతో 14 ఏళ్ల వయసులో నక్సలిజంలో చేరారు అనసూయ. అయినా చదువును ఎక్కడ వదలలేదు. దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపినప్పుడు జైలులో ఉంటూనే పదో తరగతి పూర్తి చేశారు. ఆపైన ప్రేమించిన తన బావ శ్రీరాముడినే పెళ్లి చేసుకున్న అనసూయ, సీతక్కగా తన పేరును మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తరువాత రెండు నెలల పిల్లాడిని ఇతరులకు అప్పగించి, అడవిబాట పట్టారు సీతక్క. ఇక దంపతుల మధ్య విబేధాలు రావడంతో, దళంలో పొసగలేక 1996లో జనజీవన స్రవంతిలోకి వచ్చారు సీతక్క. ఆ తరువాత ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటిడీఏ)లో నెల జీతానికి పనిచేస్తూ చదువు కొనసాగించారు.
అలా ‘లా’ చదివిన సీతక్క ఆపైన చంద్రబాబు ప్రోత్సాహంతో తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. 2004లో ఏకంగా అసెంబ్లీ బరిలో పోటీ చేసే అవకాశం చేజిక్కించుకున్నారు. ములుగు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్యపై బరిలోకి దిగిన విజయం సాధించి, తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆలా ఎమ్మెల్యే అయిన సీతక్క నిత్యం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడు అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయములో టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన సీతక్క, 2017లో కాంగ్రెస్ గూటికి చేరారు. 2019 ఎన్నికల్లో మరోసారి ములుగు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగురవేశారు.
ఇక కరోనా సమయంలో అందరూ ఇళ్ళకే పరిమితం అయితే తాను మాత్రం ప్రభుత్వ సహాయం లేకున్నా, తన నియోజకవర్గంలో గ్రామాల్లో తిరుగుతూ ఎంతోమందికి ఆహారం, నిత్యావసర వస్తువులను అందజేసి ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటో తెలియజేశారు. ఆలా జనంలో నాలుకగా ఎదిగిన సీతక్క, తెలంగాణ కాంగ్రెస్ మహిళా ఇంచార్జ్‌గా ఉంటూనే, ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు. నేడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో నిలిచారు. తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలోని గోత్తి కోయ గిరిజనుల జీవన స్థితిగతుల మీద పరిశోధనలకు గౌరవ డాక్టరేట్ పొందారు. అలా నక్సలైట్ జీవితం నుండి లాయర్ గా మారి ఆపైన ఎమ్మెల్యే అయిన ఆమె జీవితం ఎందరికో ఆదర్శం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…