
కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో వరి, పత్తి పంటలపై అడవి పందులు విరుచుకుపడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా పొలాల్లోకి గుంపులుగా ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ముఖ్యంగా వరి కోత దశలో పందుల దాడులతో భారీగా నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోతుల గుంపులు పంటలను నాశనం చేయడంతో పాటు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
పంటను కాపాడుకునేందుకు రైతులు చీరలు కట్టడం, కంచెలు ఏర్పాటు చేయడం, సోలార్ ఫెన్సింగ్ వంటి సొంత ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. అంతేకాదు.. జంతువులను తరిమే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయంటున్నారు. ఇటీవల గంభీరావుపేట మండల కేంద్రంలో అడవి పందుల నివారణకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్ తగిలి దంపతులు మృతి చెందారు. గతంలో మంథని ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి అడవి జంతువుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. లేదంటే పంట నష్టపోవడమే కాదు… ప్రాణాలు సైతం పోయే పరిస్థితులున్నాయని ఆవేదన చెందుతున్నారు.