Telangana: కదనసీమలో కొదమసింహాలే.. పోలీసుశాఖలో ఈ 12 రకాల శునకాలు ప్రత్యేకం.. క్లూ ఇస్తే చాలు..

|

Feb 16, 2023 | 5:20 PM

హైదరాబాద్‌ మొయినాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నాయి. పోలీస్ జాగిలాలు, ట్రైనర్ల పాసింగ్ ఔట్ పరేడ్ వారెవ్వా అనేలా సాగింది.

విశ్వాసానికి ప్రతీక శునకాలు. చక్కని ట్రైనింగ్‌ ఇస్తే యజమాని భద్రతకు అవి ఇచ్చే భరోసా ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ప్రపంచంలో 435 రకాల శునక జాతులున్నాయి. వాటిలో 12 రకాల శునకాలు నేర పరిశోధనలో కీలకం. సరిగ్గా అలాంటి డిటెక్టివ్ డాగ్సే.. హైదరాబాద్‌ మొయినాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నాయి. పోలీస్ జాగిలాలు, ట్రైనర్ల పాసింగ్ ఔట్ పరేడ్ వారెవ్వా అనేలా సాగింది. ఇంటి యజమానులతో శునకాలు ఎంత విశ్వాసం చూపుతాయో.. పోలీస్‌ కేసుల పరిశోధనలో కూడా అంతే కీ రోల్‌ పోషిస్తాయి. బందోబస్తు, దొంగతనాలు, హత్య కేసుల్లో నేరస్థుల కదలికలను గుర్తించడం, బాంబులు, మందు సామాగ్రిని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్నో కీలక కేసులను శునకాలు చేధించిన సందర్భాలు ఉన్నాయి.

తెలంగాణ పోలీస్ శాఖ.. లెబ్రడాల్‌, డాబర్‌మెన్‌, ఆల్సీషియన్‌, గోల్డెన్‌ రిట్రీవర్‌, డాల్మేషన్‌, జర్మన్‌షెపర్డ్‌ జాగిలాల సేవలను ఎక్కువగా వినియోగించుకుంటోంది. జమ్మూకశ్మీర్‌లో జూమ్‌ ఘటన తర్వాత.. బెల్జియం మిలోనెస్‌ జాతికి చెందిన శునకాలను కూడా తన అమ్ములపొదిలో చేర్చుకుంది. మొయినాబాద్ శిక్షణా కేంద్రం లో 48 జాగిలాలకు 8 నెలల పాటు.. 64 మంది హ్యాండ్లర్లు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. 48 జాగిలాల్లో ఐదు రకాలున్నాయి. లెబ్రడాల్‌ 21, జర్మన్ షెప్పర్డ్ 1, బెల్జియం మాలినోస్ 21, కోకోర్ స్పానియల్ 4, గోల్డెన్‌ రిట్రీవర్ 1 జాతులకు చెందినవి ఉన్నాయి. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జాగిలాలు, శిక్షకులు ఈ బ్యాచ్ లో ఉన్నారు.

ఉదయం, సాయంత్రం..

స్నిఫర్‌ డాగ్స్‌ శిక్షణలో దినచర్యకు ప్రాధాన్యముంటుంది. ఉదయాన్నే 6 గంటలకల్లా పరేడ్‌ మైదానానికి తీసుకెళ్తారు. రెండు గంటల పాటు.. రన్నింగ్‌, వ్యాయామం చేయిస్తారు. ఆ తర్వాత హ్యాండ్లర్లు వాటిని అర గంటపాటు గ్రూమింగ్‌ చేస్తారు. ఎనిమిదిన్నరకు బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌ ఉంటాయి. సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఇస్తారు.

ఇవి కూడా చదవండి

పోలీస్‌ శాఖ అంటేనే క్రమ శిక్షణకు మారుపేరు. అందుకు తగ్గట్టే జాగిలాలు కూడా క్రమశిక్షణను పాటిస్తాయి. అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు.. విచారకర సంఘటనల సమయంలో హ్యాండ్లర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ జాగిలాలు ప్రవర్తిస్తాయి. సెల్యూట్‌ చేయడం, నిర్దేశించిన వాహనంలోకి.. లేదంటే ప్రదేశంలోకి వెళ్ళేలా హ్యాండ్లర్‌ ఇచ్చిన ఆదేశాలను శిరసావహిస్తాయి.

ఇట్టే పట్టేస్తాయి..

మనుషులతో పోలిస్తే ఈ జాగిలాలకు వాసన చూసే శక్తి 40 రేట్లు.. వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు పది రేట్లు ఎక్కువగా ఉంటుంది. విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్‌ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయి.

పోలీస్ శాఖలో అంతర్గత భాగమైన కె-9 జాగిలా వ్యవస్థలో భాగంగా మొయినాబాద్ ఐఐటిఏలో 22వ బ్యాచ్ జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్‌ను డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..