విద్యార్థులకు చట్టాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన

హయత్‌నగర్‌లోని స్కూల్‌లో విద్యార్థులకు చట్టాలు, పౌరుల హక్కులు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రమేష్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పూర్తి వివరాలు కథనంలో .. ..

విద్యార్థులకు చట్టాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన
Student Awareness

Updated on: Nov 07, 2026 | 4:12 PM

విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలు, పౌరుల హక్కులు, సామాజిక బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య సూచించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రమేష్ విద్యార్థులకు సూచించారు.

హయత్‌నగర్‌లోని మేపుల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థులకు చట్టాలు, హక్కులు, సామాజిక బాధ్యతలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రమేష్ హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ శంకరయ్య మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి దేశ చట్టాలు, పౌరుల హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకోవాలని అన్నారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలతో పాటు తల్లిదండ్రులు కూడా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చట్టాలు, సైబర్ భద్రత, ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి తమ సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రశ్నలకు ఇన్‌స్పెక్టర్లు శంకరయ్య, రమేష్ సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు. పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణ కోసమే పనిచేస్తుందని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ చిరంజీవి, పాఠశాల డైరెక్టర్ సుబ్బారావు, అసిస్టెంట్ డైరెక్టర్లు స్వాతి, శ్వేత, ప్రిన్సిపాల్ స్మిత, అయేషా, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

వీడియో దిగువన చూడండి…

Loading...
Unable to load recommendations.
Follow Us