కళ్లముందే కరిగిపోయిన ప్రాణం.. కరెంట్ షాక్‌తో విద్యార్థిని మృతి!

తెలంగాణలోని హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముషీరాబాద్‌లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని హాస్టల్‌లో విద్యుత్ షాక్‌కు గురై 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో విద్యార్ధినికి సైతం తీవ్రగాయాలవ్వగా.. మరో విద్యార్ధిని తృటిలో తప్పించుకున్నట్టు తెలుస్తోంది.

కళ్లముందే కరిగిపోయిన ప్రాణం.. కరెంట్ షాక్‌తో విద్యార్థిని మృతి!
Electric Shock

Updated on: Nov 18, 2026 | 11:05 AM

తెలంగాణలోని హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముషీరాబాద్‌లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని హాస్టల్‌లో విద్యుత్ షాక్‌కు గురై 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో విద్యార్ధినికి సైతం తీవ్రగాయాలవ్వగా.. మరో విద్యార్ధిని తృటిలో తప్పించుకున్నట్టు తెలుస్తోంది. కాగా మృతి చెందిన బాలిక పాఠశాలలో చదువుతున్న రెబెకాగా వెల్లడించారు. ఈ దుర్ఘటనతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు తోటి విద్యార్ధినిలు సైతం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

స్థానిక పాఠశాల ప్రాంగణంలోనే ఓ స్వచ్ఛంద సంస్థ “నైటింగేల్” బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. రెబకాతో పాటు మరో 59 మంది విద్యార్థినులు హూమ్‌లో ఉంటున్నట్టు సమాచారం. అయితే సోమవారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో రెబకా తన తోటి విద్యార్థినులు నందిని (14), జయశ్రీ (9)తో కలిసి వసతి గృహం పై అంతస్తులోని టెర్రస్‌పైకి వెళ్లింది. వారంతా అక్కడ ఆడుకుంటున్న సమయంలో రెబకాకు ఓ తుడిచే కర్ర (మాప్) కనిపించింది. దాన్ని తీసుకొని ఆడుకుంటూ ఉంటుండగా.. ఆ మాప్‌కు ఉన్న ఇనుప గొట్టం ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురైన బాలిక అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్టు చెబుతున్నారు.

మరోవైపు రెబకాను కాపాడేందుకు నందిని ప్రయత్నించగా.. ఆమె చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక పరిస్థితిని గమనించిన జయశ్రీ వెంటనే కిందకు పరుగెత్తుకుంటూ వెళ్లి హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. ఇద్దరు బాలికలను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రెబకా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నందినికి చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై రెబకా తండ్రి సంఘం జంపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. అలానే ఈ ఘటనపై పాఠశాల విద్యాశాఖ అధికారులు సైతం స్పందించారు. విచారణ అనంతరం నివేదికను హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us