బిర్యానీలో పురుగులు? వంటగదుల్లో ఎలుకల మలమూత్రాలు.. 6 ప్రముఖ సంస్థలపై ఫుడ్ సేఫ్టీ కొరడా!

హైదరాబాద్ మహానగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం తింటున్నారా? ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వంటగదుల్లో ఎలుకల వ్యర్థాలు, బొద్దింకలు, ఈగలు, బూజు, కుళ్లిపోయిన ఆహార పదార్థాలు బయటపడటం కలకలం రేపుతోంది.

బిర్యానీలో పురుగులు? వంటగదుల్లో ఎలుకల మలమూత్రాలు.. 6 ప్రముఖ సంస్థలపై ఫుడ్ సేఫ్టీ కొరడా!
Hyderabad Food Safety Raid

Updated on: Nov 21, 2026 | 3:50 PM

హైదరాబాద్: మహానగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం తింటున్నారా? ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వంటగదుల్లో ఎలుకల వ్యర్థాలు, బొద్దింకలు, ఈగలు, బూజు, కుళ్లిపోయిన ఆహార పదార్థాలు బయటపడటం కలకలం రేపుతోంది. వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా TG SAFE అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో నాలుగు హోటళ్ల లైసెన్సులను సస్పెండ్ చేయగా, మరో రెండు సంస్థలను మూసివేశారు.

9 సంస్థల్లో 8 ప్రత్యేక బృందాల తనిఖీలు

CURE రీజియన్ పరిధిలోని తొమ్మిది ఆహార సంస్థల్లో తనిఖీలు చేపట్టేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను అధికారులు రంగంలోకి దించారు. ది స్పైస్ కిచెన్ (కూకట్‌పల్లి), రాజు గారి బిర్యానీ (చైతన్యపురి), స్వాద్ స్పైసీ (నాగోల్), మాదాపూర్ బావర్చి (అయ్యప్ప సొసైటీ), మెహఫిల్ రెస్టారెంట్ (బల్కంపేట), అన్నపూర్ణ క్యాటరర్స్ (చందానగర్), మతామ్ అల్ యమాని అరేబియన్ రెస్టారెంట్ (టోలీచౌకి), అల్ కరీం బేకర్స్ (టోలీచౌకి), శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్ (గౌలిదొడ్డి)లో తనిఖీలు నిర్వహించారు.

వంటగదుల్లో విస్తుపోయే దృశ్యాలు

పలు సంస్థల్లో కనీసం FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండానే ఆహార వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వంటగదుల్లో విరిగిన టైల్స్, పేరుకుపోయిన ఆహార వ్యర్థాలు, కంపుకొడుతున్న డ్రైనేజీలు, జిడ్డు పట్టిన చిమ్నీలు, బూజు పట్టిన గోడలు కనిపించాయి. ఆహార పదార్థాల వద్ద బొద్దింకలు, ఈగలు తిరుగుతుండగా, కొన్ని చోట్ల ఎలుకల మలాన్ని కూడా గుర్తించారు. ఫ్రిజ్‌లలో శాఖాహార, మాంసాహార పదార్థాలను కలిపి నిల్వ చేయడం, కుళ్లిపోయిన జీడిపప్పు వినియోగం, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. సిబ్బంది వైద్య పరీక్షల రికార్డులు, నీటి నాణ్యత పరీక్ష నివేదికలు కూడా కొన్ని సంస్థల్లో అందుబాటులో లేవని TG SAFE అధికారులు తెలిపారు.

4 హోటళ్ల లైసెన్సులు సస్పెండ్

  1. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు నాలుగు ప్రముఖ హోటళ్ల లైసెన్సులను సస్పెండ్ చేశారు.
  2. మాదాపూర్ బావర్చి: వంటగదిలో గుట్కా మరకలు, బొద్దింకలు, జిడ్డు పట్టిన నేల, అపరిశుభ్రమైన ఫ్రిజ్‌లు.
  3. ది స్పైస్ కిచెన్: స్టోర్ రూమ్‌లో ఎలుకల మలం, పాడైన జీడిపప్పు, బొద్దింకలు, మూతలు లేని చెత్త డబ్బాలు.
  4. మతామ్ అల్ యమాని: ఆహార పదార్థాల్లో పురుగులు, భారీగా బొద్దింకలు, సింథటిక్ రంగుల వినియోగం.
  5. అన్నపూర్ణ క్యాటరర్స్: వంటగదిలో సాలెగూళ్లు, పొగ మరకలు, అపరిశుభ్రమైన ఐస్‌క్రీం బాక్సులు, వైద్య రికార్డుల కొరత.

ఈ నాలుగు హోటళ్లను తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని స్విగ్గీ, జొమాటో సంస్థలకు అధికారులు సమాచారం పంపారు.

రెండు సంస్థలు సీజ్.. 135 కిలోల ఆహారం ధ్వంసం

లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న టోలీచౌకిలోని అల్ కరీం బేకర్స్, గౌలిదొడ్డిలోని శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్‌ను అధికారులు మూసివేశారు. మొత్తం ఎనిమిది ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. సుమారు 135 కిలోల కల్తీ అనుమానిత, పాడైపోయిన ఆహార పదార్థాలను సీజ్ చేసి ధ్వంసం చేశారు.

మరోవైపు చైతన్యపురిలోని రాజు గారి బిర్యానీ, నాగోల్‌లోని స్వాద్ స్పైసీ సహా రెండు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బల్కంపేటలోని మెహఫిల్ రెస్టారెంట్‌కు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసు ఇచ్చారు. తిరిగి తనిఖీలు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

అటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. మిక్చర్ తయారీ కేంద్రంలో నాసిరకం, గడువు ముగిసిన పదార్థాలతో తినుబండారాలు తయారు చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో శ్రీ కర్ణి మాత కేంద్రంపై దాడి చేశారు. తనిఖీల్లో అధికారులు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యత లేని, గడువు ముగిసిన పదార్థాలను ఉపయోగించి మిక్చర్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్రం నిర్వాహకులు రఘువీర్ సింగ్, చలో సింగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా ఆహార పదార్థాలు తయారు చేస్తే ఊరుకునేదీ లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమా?

ఈ తనిఖీలు నగరంలోని ఆహార భద్రత ప్రమాణాలపై మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. హోటళ్లలో రుచికరమైన వంటకాలతో పాటు పరిశుభ్రత, నాణ్యత కూడా తప్పనిసరి. ఆహారం తీసుకునే ముందు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us