మున్సిపాలిటీలో మూడు పూలు, ఆరు కాయల దందా.. ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ACB!

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సెప్టెంబర్‌ 30న నిర్వహించిన ట్రాప్‌లో ఇద్దరు అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ గుండు వాణి, సీనియర్‌ అసిస్టెంట్‌ యలమోని సుదర్శన్‌.. చట్టవిరుద్ధ నిర్మాణానికి సహాయం చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.75,000 లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తుండగా ఏసీబీ బృందం అదుపులోకి తీసుకుంది. వారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతోంది.

మున్సిపాలిటీలో మూడు పూలు, ఆరు కాయల దందా.. ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ACB!
Moinabad Acb Trap

Updated on: Oct 01, 2026 | 2:07 PM

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. రూ.75 వేల లంచం డిమాండ్ చేసి, ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్‌ 30న ఈ ట్రాప్‌ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ గుండు వాణి (AO-1), ఫిర్యాదుదారుడి నిర్మాణాన్ని చట్టవిరుద్ధమైనదిగా పరిగణించి, దానిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా అధికారికంగా సహాయం చేస్తానని చెప్పినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.75,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ ఆరోపించింది.

ఈ లంచం మొత్తాన్ని సీనియర్‌ అసిస్టెంట్‌ యలమోని సుదర్శన్‌ (AO-2) ద్వారా తీసుకోవాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. సుదర్శన్‌ గతంలో మొయినాబాద్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం మొయినాబాద్‌ మున్సిపాలిటీలో డిప్యూటేషన్‌పై సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారలుు వెల్లడించారు.

ఫిర్యాదు అందడంతో రంగారెడ్డి జిల్లా రేంజ్‌-2 ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. పథకం ప్రకారం రూ.75 వేల లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఇద్దరు అధికారులను ట్రాప్‌ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. AO-2 సూచన మేరకు అతని స్వాధీనం నుంచి రూ.75,000 లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు అధికారులు తమ విధులను నిబంధనల ప్రకారం, నిజాయితీగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. వారిపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

ఇద్దరు నిందితులను జ్యుడిషియల్‌ రిమాండ్‌ నిమిత్తం నాంపల్లిలోని SPE & ACB కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి పేరు, ఇతర వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ తెలిపింది. ప్రభుత్వ అధికారి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ ‘1064’కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్‌ నంబర్‌ ‘9440446106’ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us