కోదాడ వద్ద రక్తసిక్తమైన రహదారి.. ఆరుగురిని మింగేసిన అతివేగం.. 12 మందికి సీరియస్..!

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద బుధవారం (ఆగస్టు 26) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐరన్ రాడ్ల లోడ్‌తో ఉన్న కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కోదాడ వద్ద రక్తసిక్తమైన రహదారి.. ఆరుగురిని మింగేసిన అతివేగం.. 12 మందికి సీరియస్..!
Horrific Tragedy In Kodad

Edited By:

Updated on: Aug 26, 2026 | 9:02 AM

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద బుధవారం (ఆగస్టు 26) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐరన్ రాడ్ల లోడ్‌తో ఉన్న కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

కొంపముంచిన అతివేగం!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి 42 మంది ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరుకు బయలుదేరింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత ప్రయాణం కొనసాగిస్తున్న బస్సు తెల్లవారుజామున కోదాడ మండలం ద్వారకుంట వద్దకు చేరుకుంది. అదే సమయంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఢీకొన్న సమయంలో కంటైనర్‌లో లోడ్ చేసిన పొడవాటి ఇనుప రాడ్లు బస్సులోకి దూసుకెళ్లాయి. దీంతో బస్సు ముందు భాగం, ముఖ్యంగా డ్రైవర్ వైపు తీవ్రంగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులు ఇనుప రాడ్లు, బస్సు శిథిలాల మధ్య చిక్కుకుపోయారు.

బస్సులో భయానక పరిస్థితి!

ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో భయానక పరిస్థితి నెలకొంది. క్షతగాత్రులు, బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు కాపాడాలంటూ కేకలు వేయడంతో ఘటనాస్థలిలో విషాదకర వాతావరణం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ఇనుప రాడ్లు, బస్సు ధ్వంసమైన భాగాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు గంటకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 12 మందిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

ప్రమాదం కారణంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సు, కంటైనర్‌ను రహదారి నుంచి తొలగించే ప్రక్రియను చేపట్టారు.

జిల్లా ఎస్పీ వివరణ

ప్రమాద స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బస్సు అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఢీకొన్న వేగానికి బస్సు తీవ్రంగా ధ్వంసమైందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. ఆరుగురు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే: ఏపీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరుగురు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల అప్రమత్తత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా అధికారులు మరింత కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

కోదాడ సమీపంలోని ఈ ఘోర ప్రమాదం మరోసారి ప్రైవేట్ బస్సుల వేగం, డ్రైవర్ల అప్రమత్తత, రహదారులపై భారీ వాహనాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రమాదానికి పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us