దారుణం.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అడవిలో వదిలేశారు

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నిస్సహాయ మహిళను ఇంటికి తీసుకెళ్తామని చెప్పి కుటుంబసభ్యులు కారులో ఎక్కించుకుని.. కాటారం-మేడారం రహదారి పక్కన పెద్దవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అసహాయ స్థితిలో ఉన్న ఆమెను స్థానికుడు మల్లేశ్‌ గుర్తించి 108కు సమాచారం అందించడంతో మహదేవపూర్‌ ఆసుపత్రికి తరలించారు..

దారుణం.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అడవిలో వదిలేశారు
Sick Woman Abandoned In Forest

Updated on: Aug 22, 2026 | 7:18 AM

జయశంకర్‌ భూపాలపల్లి, ఆగస్ట్‌ 22: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను సొంత కుటుంబసభ్యులు చికిత్స కోసం తీసుకెళ్లి.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి చివరకు అడవిలోని చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల చొరవతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మానవత్వాన్ని ప్రశ్నించే ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే..

మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం గ్రామానికి చెందిన లలిత (35) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు ఆమెకు కరీంనగర్‌లో చికిత్స చేయించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇంటికి తీసుకెళ్తామని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున కాటారం-మేడారం ప్రధాన రహదారి పక్కన పెద్దవాగు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. చెట్ల పొదల్లో ఆమెను వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం. అనారోగ్యంతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న లలిత రోధిస్తూ అక్కడే ఉండిపోయింది. అటుగా వెళ్తున్న కాటారం వాసి మల్లేశ్‌ చెట్ల పొదల్లో మహిళను గుర్తించారు. ఆమె పరిస్థితిని గమనించిన వెంటనే 108కు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని లలితను మహదేవపూర్‌ సామాజిక ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మహిళను అడవిలో వదిలేసిన విషయం తెలుసుకున్న పలువురు డయల్‌ 112కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే సంబంధిత పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లలితకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమెను అడవిలో వదిలేసిన పరిస్థితులు ఏమిటి? కుటుంబసభ్యులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందింది? అనే విషయాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహిళను అటవీ ప్రాంతంలో వదిలేసిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us