
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మృతి ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. చలికి ఇబ్బంది పడుతోందని భావించి పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చిన తండ్రికి.. అంతలోనే కూతురిని కోల్పోవాల్సి వస్తుందని ఊహించలేదు. ఇంటి వద్ద జరిగిన ఓ చిన్న ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆటో, ఇంటి పిల్లర్ మధ్య చిక్కుకుని తీవ్రంగా గాయపడిన 12 ఏళ్ల బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ‘మా ఇంటి లక్ష్మి ఇక కనిపించదా?’ అంటూ తల్లిదండ్రులు విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కారాయిగూడెం గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రావూరి పాపారావు, స్వాతి దంపతులకు కుమార్తె పావని (12), ఒక కుమారుడు ఉన్నారు. పాపారావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవలే ఆయన కొత్తగా ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేశారు. ప్రతిరోజూ ఉదయం ఇంటి వద్దే ఆటోను స్టార్ట్ చేసి, శుభ్రం చేస్తూ కొద్దిసేపు ఉంచేవారు.
ఈ నెల 18న కూడా ఎప్పటిలాగే ఉదయం ఆటోను స్టార్ట్ చేసి తుడుస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కుమార్తె పావని అనుకోకుండా ఆటో యాక్సిలేటర్‌ను పెంచింది. దీంతో ఒక్కసారిగా ఆటో ముందుకు దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఇంటి పిల్లర్‌కు, ఆటోకు మధ్య పావని ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాల కారణంగా పావని మృతి చెందింది.
పావని అడవిమల్లెల ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గత వారం రోజులుగా చలి తీవ్రత పెరగడంతో చన్నీళ్లతో స్నానం చేసేందుకు ఇబ్బంది పడుతోందని తల్లిదండ్రులు భావించారు. దీంతో తండ్రి మూడు రోజుల క్రితం ఆమెను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లోనే ఉంటూ మళ్లీ పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె కళ్లముందే ప్రమాదానికి గురై చివరకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండే చిన్నారి ఇక లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మా ఇంటి లక్ష్మి ఇక కనిపించదా?’ అంటూ తల్లిదండ్రులు చేస్తున్న రోదనలు గ్రామస్థులను కలచివేశాయి. బాలిక అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో పాత కారాయిగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.