నేటి నుంచి ఎంగిలి పువ్వు బతుకమ్మ షురూ

తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు.

నేటి నుంచి  ఎంగిలి పువ్వు  బతుకమ్మ షురూ
Follow us

|

Updated on: Oct 16, 2020 | 10:11 AM

వర్షాకాలం ముగుస్తూ, శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా వుంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా వుంటుంది. చెరువులన్నీ తాజా నీటితో కళకళలాడుతాయి. అనేక రకాలైన పూలు రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటాయి. వీటిలో గునుక, తంగేడి పూలతో వనం కనులవిందు చేస్తుంది. ప్రకృతి రమణీయతతోపాటు రైతులకు కూడా సంతృప్తికరంగా వుండే వాతావరణం తెలంగాణ అంతటా వుంటుంది. ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు.

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ శుక్రవారం ప్రారంభం కానుంది. తొమ్మిదిరోజుల పాటు ఈనెల 24 వరకు ఈ పండుగ జరుగుతుంది. శతాబ్దాల చరిత గల బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మహిళలు, యువతులు, బాలికలకు ప్రీతిపాత్రమైన ఈ పండుగలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారు. చివరిరోజు సద్దుల బతుకమ్మతో తెలంగాణ పూల పండుగను ముగిస్తారు. అయితే, ఈసారి కరోనా ప్రభావంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. ఇళ్ల వద్దనే పండుగ జరుపుకోవాలని భావిస్తోంది.

బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులంతా జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. ప్రత్యేక పరిస్థితుల మధ్య పండుగ జరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ మూడు వీడియో పాటలను, 9 పాటలతో కూడిన సీడీని విడుదల చేశారు.

బతుకమ్మ పండుగ విషయంలో ఈసారి కొంత కన్‍ఫ్యూజన్‍ నెలకొంది. ఈ ఏడాది అధిక మాసం రావడం గందరగోళానికి కారణమవుతోంది. ఏటా భాద్రపద మాసంలో పెత్రమాస (పితృ అమావాస్య) సందర్భంగా మొదటిరోజైన ఎంగిలిపూల బతుకమ్మ ఆడుకునే ఆచారం ఉంది. ఆ విధంగా చూస్తే సెప్టెంబర్ నెలలోనే బతుకమ్మ మొదలు కావల్సి ఉంది. కాగా, సిద్ధాంతులు, వేద పండితులు మాత్రం అక్టోబర్ 16న అధిక ఆశ్వీజ మాసంలోని అమావాస్య నుంచి వరుసగా తొమ్మిది రోజులు బతుకమ్మ చేసుకోవాలని సూచించారు. దీంతో ఇవాళ ఎంగిలి పూవ్వు బతుకమ్మతో పూల పండుగ సంబురాలు షురూ అయ్యాయి.